రహానే 'ఒక్కడే'!

5 Dec, 2015 15:31 IST|Sakshi
రహానే 'ఒక్కడే'!

ఢిల్లీ: అజింక్యా రహానే..నిలకడకు మారుపేరు. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో రహానే తనవంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తూ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రహానే(127) సెంచరీతో అదరగొట్టి టీమిండియాను పటిష్టస్థితికి చేర్చాడు. దీంతో టీమిండియా ఆడిన చివరి ఏడు టెస్టు సిరీస్ ల్లో కనీసం ఒక ఇన్నింగ్స్ లో 90కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.  అంతకుముందు టీమిండియా ఆడిన ఆరు టెస్టు సిరీస్ ల్లో రహానే ఏదో ఒక ఇన్నింగ్స్ లో నమోదు చేసిన వ్యక్తిగత స్కోర్లను చూస్తే శ్రీలంకపై 126, బంగ్లాదేశ్ పై 98, ఆస్ట్రేలియాపై 147, ఇంగ్లండ్ పై 103, న్యూజిలాండ్ పై 118, దక్షిణాఫ్రికాపై 96 పరుగులు చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

 

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తాజా టెస్టు సిరీస్ భాగంగా చివరి టెస్టులో రహానే భారత్ లో మొదటి శతకాన్ని నెలకొల్పడమే కాకుండా.. సఫారీ బౌలర్లకు పరీక్షగా నిలిచి వారిపై తొలి సెంచరీ సాధించాడు. దీంతో ఓవరాల్ గా ఐదో టెస్టు సెంచరీని అతని ఖాతాలో వేసుకున్నాడు. 2013 లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఆస్ట్రేలియాతో  జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన రహానే తనదైన శైలితో ఆడుతూ టీమిండియా విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

మరిన్ని వార్తలు