ఇక్కడ 320 మంచి స్కోరు: రహానే

21 Feb, 2020 05:01 IST|Sakshi

నేటి నుంచి భారత్, న్యూజిలాండ్‌ తొలి టెస్టు

వెల్లింగ్టన్‌: తొలిటెస్టుకు ఆతిథ్యమిస్తున్న బేసిన్‌ రిజర్వ్‌ మైదానం పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 320 పరుగులైన ఉత్తమ స్కోరే అని భారత వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే అన్నాడు. ‘కివీస్‌ సొంతగడ్డపై జరిగే ఈ టెస్టు సిరీస్‌లో న్యూజిలాండే ఫేవరెట్‌. ఎందుకంటే ఇక్కడి ట్రాక్‌పై వారి బౌలర్లకు, బ్యాట్స్‌మెన్‌కు ఉన్న అవగాహన ఇంకెవరికీ ఉండదు. కివీస్‌ మైదానాలన్నీ భిన్నంగా ఉంటాయి. అయితే ఓ జట్టుగా అవి ఎలా ఉంటాయోనన్న విషయాల్ని మేం వెంటనే పసిగడితేనే మ్యాచ్‌పై పట్టు సాధించగలం’ అని అన్నాడు. లార్డ్స్‌ (2014), అడిలైడ్‌ (2018) టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులలోపు చేసి చారిత్రక టెస్టు విజయాల్ని సాధించామని ఇప్పుడు ఇక్కడా అదే ఫార్ములాను నమ్ముకున్నామని రహానే చెప్పాడు. గతంలో ఇంగ్లండ్‌లో 295 పరుగులు, ఆసీస్‌లో 250 పరుగులు చేసినా భారత్‌ గెలిచింది. ‘ముందుగా బ్యాటింగ్‌ చేస్తే తాజా మైండ్‌సెట్‌తో సానుకూల దృక్పథంతో పరుగులు సాధించే వీలవుతుంది. పైగా విదేశీ గడ్డపై 320, 330 పరుగుల స్కోర్లే ఉత్తమ స్కోర్ల వుతాయి. మేం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో సాధించిన టెస్టు విజయాలకు ఆ స్కోర్లే పట్టుచిక్కేలా చేశాయి’ అని వైస్‌ కెప్టెన్‌ అన్నాడు. వెల్లింగ్టన్‌లోని బెసిన్‌ రిజర్వ్‌ వేదికపై రహానేకు తీపి గుర్తులున్నాయి. 2014లో ఇక్కడ టెస్టు కెరీర్‌లో తను తొలి సెంచరీ నమోదు చేశాడు.

>
మరిన్ని వార్తలు