సారథిని మార్చితేనే బెటర్‌

24 Jul, 2019 20:49 IST|Sakshi

రావల్పిండి : తాజా ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ఓటమిని ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటగాళ్ల ప్రదర్శనను, కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ వైఫల్యాలను వేలెత్తి చూపుతూ నిందిస్తున్నారు. తాజాగా రావల్పిండి ఎక్స్‌ ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ పాక్‌ సారథి సర్ఫరాజ్‌పై మరోసారి నిప్పులు చెరిగాడు. బుధవారం తన యూట్యూబ్‌ చానల్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసిన అక్తర్‌.. పాక్‌ జట్టుకు సారథిని మార్చే సమయం వచ్చిందంటూ పేర్కొన్నాడు. అయితే సర్ఫరాజ్‌ను జట్టు నుంచి తప్పించాల్సిన అవసరం లేదన్నాడు. అతడి కీపింగ్‌, బ్యాటింగ్‌ పాక్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. సర్ఫరాజ్‌ స్థానంలో వన్డే, టీ20లకు హారీస్‌ సోహైల్‌ను, టెస్టులకు బాబర్‌ అజమ్‌ను సారథులుగా ఎంపిక చేయాలని సూచించాడు. 

‘సర్ఫరాజ్‌ స్వతహాగా సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగితే బెటర్‌. కెప్టెన్సీ నుంచి తప్పుకొని బ్యాటింగ్‌, కీపింగ్‌పై దృష్టి పెడితే అతడికి, పాక్‌ క్రికెట్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచకప్‌లో పాక్‌ సారథిగా సర్ఫరాజ్‌ తేలిపోయాడు. యువకులకు సారథ్య బాధ్యతలను అప్పగిస్తే బెటర్‌. హారీస్‌ సోహైల్‌(వన్డే, టీ20), బాబర్‌ అజమ్‌(టెస్టు)లకు సారథ్య బాధ్యతలను అప్పంగించాలి’అంటూ అక్తర్‌ పేర్కొన్నాడు. ఇక గతంలో కూడా సర్ఫరాజ్‌ ‘తెలివితక్కువ సారథి’అంటూ వ్యాఖ్యానించాడు. ఇక పాక్‌ జట్టును త్వరలోనే అన్ని విధాల సెట్‌ చేస్తానని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు