అక్షర్‌కు అవకాశం దక్కుతుందా!

2 Jan, 2015 01:40 IST|Sakshi
అక్షర్‌కు అవకాశం దక్కుతుందా!

సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఇప్పటికే కోల్పోయిన నేపథ్యంలో నాలుగో టెస్టులో భారత తుది జట్టు ఏ విధంగా ఉండబోతోందో అనేది ఆసక్తికరం. సిడ్నీ క్రికెట్ మైదానం (ఎస్‌సీజీ) స్పిన్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. మ్యాచ్ నాలుగు, ఐదు రోజుల్లో స్పిన్నర్లు ప్రభావితం చేస్తారని రికార్డులు చెబుతున్నాయి.  కాబట్టి తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉండే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు కూడా ఇదే ఆలోచనతో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆస్టన్ అగర్‌కు జట్టులో చోటిచ్చింది. కాబట్టి భారత్‌నుంచి అశ్విన్‌తో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఆడతాడా అనేది చూడాలి. గాయపడిన జడేజా స్థానంలో ఆస్ట్రేలియాకు వచ్చిన అక్షర్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు.

కోహ్లి సారథ్యంలో వన్డేలు ఆడిన అక్షర్‌పై కెప్టెన్‌కు మంచి నమ్మకముండటం కూడా అతని అవకాశాలు పెంచుతోంది. అక్షర్‌ను తీసుకుంటే ఉమేశ్, షమీలలో ఒకరిపై వేటు పడుతుంది. వరుసగా విఫలమవుతున్న ధావన్ స్థానంలో సురేశ్ రైనాకు చోటు ఇవ్వాలని కూడా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైనా, తన సహజమైన ఓపెనింగ్ స్థానంలో రాహుల్ ఆడతాడు. రైనాకు ఆరోస్థానంలో బరిలోకి దిగుతాడు. రైనా స్పిన్ బౌలింగ్ కూడా కొంత వరకు ఉపయోగపడవచ్చు. మరో వైపు ధోని తప్పుకోవడంతో వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా బరిలోకి దిగడం మాత్రం ఖాయమైంది.

మరిన్ని వార్తలు