మూడు టెస్టులు ఫిక్స్‌!

28 May, 2018 04:18 IST|Sakshi
రాంచీ టెస్టు టాస్‌ సందర్భంగా స్మిత్, కోహ్లి (ఫైల్‌)

‘ఆల్‌ జజీరా’ స్టింగ్‌ ఆపరేషన్‌లో బహిర్గతం

‘డి’ గ్యాంగ్‌ కనుసన్నల్లో ఫిక్సింగ్‌

భారత క్రికెటర్ల ప్రమేయం లేదు  

న్యూఢిల్లీ: మళ్లీ ఫిక్సింగ్‌ భూతం బుసలు కొట్టింది. గత రెండేళ్లుగా భారత్‌ ఆడిన మూడు టెస్టులు ఫిక్స్‌ అయినట్లు ఖతర్‌కు చెందిన అల్‌ జజీరా టీవీ చానెల్‌ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడవడంతో క్రికెట్‌ ప్రపంచం ఉలిక్కి పడింది. ఇదంతా కూడా దావూద్‌ (డి) గ్యాంగ్‌ కనుసన్నల్లో జరిగినట్లు ఈ చానెల్‌ నిర్వహించిన శూల శోధనలో వెల్లడైంది. ఇందులో ముంబైకి చెందిన ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ రాబిన్‌ మోరిస్‌ హస్తం ఉన్నప్పటికీ టీమిండియా క్రికెటర్ల ప్రమేయం లేకపోవడం ఊరట. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియోలో భారత క్రికెటర్ల పేర్లు మాత్రం లేవు.

జర్నలిస్ట్‌ డేవిడ్‌ హారిసన్‌ ఈ ఆపరేషన్‌ను ముంబై, యూఏఈ, శ్రీలంకల్లో నిర్వహించారు. దీనికి  సంబంధించిన వీడియో డాక్యుమెంటరీ ఆదివారం ‘హిందుస్తాన్‌ టైమ్స్‌’ వెబ్‌సైట్‌లో ప్రసారమైంది. మొత్తం మ్యాచ్, ఇన్నింగ్స్‌ కాకుండా కొన్ని ఓవర్లు, సెషన్లు మాత్రమే ఫిక్సయ్యాయి. అంటే మ్యాచ్‌లు జరిగిన ఐదు రోజుల్లో ఏదో ఓ రోజు పది ఓవర్లో, 20 ఓవర్లో ఫిక్స్‌ అయ్యాయి. చెన్నై (2016)లో భారత్‌–ఇంగ్లండ్‌ టెస్టు, గతేడాది రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు, గాలే (శ్రీలంక)లో శ్రీలంకతో ఆడిన టెస్టు మ్యాచ్‌లు బుకీలు, ఫిక్సర్ల బారిన పడినట్లు ఆ డాక్యుమెంటరీలో వెల్లడైంది.

ఇందులో ఇద్దరు ఆస్ట్రేలియన్, ముగ్గురు ఇంగ్లండ్‌ క్రికెటర్ల పాత్ర ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే సదరు ఆటగాళ్ల పేర్లను ‘బీప్‌’సౌండ్‌తో వినపడకుండా కవర్‌ చేశారు. పాకిస్తాన్, శ్రీలంక ఆటగాళ్ల పేర్లు మాత్రం వినిపించాయి. హసన్‌ రజా (పాక్‌ తరఫున టెస్టు ఆడిన అతిపిన్న క్రికెటర్‌), దిల్హార లోకుహెత్తిగె, జీవంత కులతుంగ, తరిందు మెండీస్‌ (శ్రీలంక)లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది. వీరితో పాటు గాలే పిచ్‌ క్యురేటర్‌ తరంగ ఇండిక పేరు వినిపించింది. ఆయన గాలేలో జరిగిన శ్రీలంక–ఆసీస్, భారత్‌–లంక టెస్టుల్లో పిచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు.

శూల శోధన వీడియోలో డి–గ్యాంగ్‌కు చెందిన అనీల్‌ మునవర్‌ మాట్లాడుతూ ‘ప్రతీ స్క్రిప్టు నాదే. నేనిచ్చిందే జరుగుతుంది... జరిగి తీరుతుంది’ అని జర్నలిస్ట్‌కు వెల్లడించారు. ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లకు రూ. 2 కోట్లు నుంచి 6 కోట్ల వరకు ఇస్తామన్నారు. గాలే క్యురేటర్‌కు రూ. 25 లక్షలిచ్చామని ఇది ఆయన (క్యురేటర్‌) ఎనిమిదేళ్ల జీతంతో సమానమని చెప్పారు. భారత మాజీ దేశవాళీ ఆటగాడు రాబిన్‌ మోరిస్‌ మాట్లాడుతూ ‘నా చేతిలో 30 మంది ఆటగాళ్లున్నారు. వాళ్లంతా నేనేది చెబితే అదే చేస్తారు’ అని అన్నాడు. అతని వ్యాపార భాగస్వామి గౌరవ్‌ రాజ్‌కుమార్‌ ‘మాకు గేమ్‌ వినోదంతో పనిలేదు. ఆట గురించి పట్టించుకోం. మాకు కావాల్సింది డబ్బే! దాని కోసమే ఇదంతా చేస్తున్నాం’ అని చెప్పాడు.  

ఐసీసీ పూర్తిస్థాయి విచారణ...
ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వెల్లడించింది. ఇందులో ఆరోపణలెదుర్కొంటున్న ఆటగాళ్ల దేశాలతో మాట్లాడి పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం... ముందు సాక్ష్యాలు కావాలని, విశ్వసనీయ రుజువులందాకే తమ ఆటగాళ్ల ప్రమేయంపై విచారణ చేపడుతామని తెలిపింది. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ టామ్‌ హారిసన్‌ మాట్లాడుతూ భారత్‌తో జరిగిన టెస్టులో మాకెలాంటి సందేహాలు లేవని, ఆటగాళ్లను అనుమానించాల్సిన అవసరం లేదని అన్నారు.

ఐసీసీ దర్యాప్తు తర్వాతే...
ఐసీసీ దర్యాప్తు జరిగేదాకా వేచి చూస్తామని, ఆ తర్వాతే తమ బోర్డు పరిధిలో విచారణ నిర్వహిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై ఆటగాడు రాబిన్‌ మోరిస్‌కు బోర్డు నుంచి రూ. 22,500 పెన్షన్‌ చెల్లిస్తున్నామని, దోషిగా తేలితే దాన్ని నిలిపివేస్తామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
 

మరిన్ని వార్తలు