హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌కు పూర్వవైభవం తెస్తాం

24 Dec, 2019 10:20 IST|Sakshi

స్పోర్ట్స్‌ మార్కెటింగ్‌ సంస్థ అల్‌ రియాదా  

హైదరాబాద్‌: ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌కు పూర్వవైభవం తెస్తామని దోహాకు చెందిన స్పోర్ట్స్‌ మార్కెటింగ్‌ సంస్థ అల్‌ రియాదా తెలిపింది. ఈ సంస్థ సోమవారం హైదరాబాద్‌లో ‘ది నిజామ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫుట్‌బాల్‌’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్‌ అలనాటి స్టార్స్‌ గురించి, భారత ఫుట్‌బాల్‌లో హైదరాబాద్‌ వారసత్వం గురించి ఈ కార్యక్రమంలో చర్చించారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన భారత మాజీ కెప్టెన్‌ షబ్బీర్‌ అలీ, విక్టర్‌ అమల్‌రాజ్, మొహమ్మద్‌ ఫరీద్, తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి ఫల్గుణ, రైల్వేస్, ఆంధ్రప్రదేశ్‌ మాజీ డిఫెండర్‌ అలీమ్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రియాదా వ్యవస్థాపక డైరెక్టర్‌ మొహమ్మద్‌ అమిన్‌ మాట్లాడుతూ ‘వన్నె తగ్గిన హైదరాబాద్‌కు పూర్వవైభవం తేవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం.

భారత ఫుట్‌బాల్‌లో ఇక్కడి సాకర్‌ దిగ్గజాలది ఘనమైన చరిత్ర. మరుగున పడిన ఈ వారసత్వాన్ని, గతమెంతో ఘనకీర్తిని సాధించిన హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ను మళ్లీ వెలుగులోకి తెచ్చేందుకు మేం కషిచేస్తాం’ అని అన్నారు. క్షేత్రస్థాయిలో ఈ క్రీడాభివద్ధికి ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకొని, ఇక్కడి ఫుట్‌బాల్‌ వారసత్వాన్ని బతికించడమే మా ఎజెండా అని సంస్థ డైరెక్టర్‌ మొహమ్మద్‌ అబిదుల్‌ ఇస్లామ్‌ చెప్పారు. హైదరాబాద్‌ దిగ్గజాల చిత్రాలతో ఉన్న కొత్త క్యాలెండర్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఫుట్‌బాల్‌కు వైభవం తెచ్చే ఇలాంటి కార్యక్రమాల్ని ఆహ్వానిస్తామని, హైదరాబాద్‌ సాకర్‌ పట్ల దూరదష్టి కనబరిచే సంస్థను ఆదరిస్తామని భారత జట్టు మాజీ కెపె్టన్, హైదరాబాద్‌కు చెందిన విక్టర్‌ అమల్‌రాజ్‌ తెలిపారు. ఈయన 1978 నుంచి 1990 వరకు కోల్‌కతాకు చెందిన మూడు క్లబ్‌లకు ఆడారు. 

>
మరిన్ని వార్తలు