అంతర్జాతీయ క్రికెట్‌కు కుక్‌ వీడ్కోలు

3 Sep, 2018 21:00 IST|Sakshi

సౌతాంప్టన్‌ : ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలెస్టర్‌ కుక్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీమిండియాతో జరుగనున్న ఐదో టెస్టు అనంతరం రిటైర్మెంట్‌ తీసుకోన్నుట్లు ప్రకటించాడు. దీంతో శుక్రవారం ఓవల్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌ అతడికి చివరిది కానుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకొన్నప్పటికీ ఎసెక్స్‌ కంట్రీ క్రికెట్‌ క్లబ్‌ తరపున ఆడతానని కుక్‌ స్పష్టం చేశాడు.

2006లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచుతో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్స్‌మెన్‌... 12, 252 టెస్టు పరుగులను(160) తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 32 శతకాలు ఉన్నాయి. వీటిలో ఓపెనర్‌గా బరిలోకి దిగి సాధించినవి11,627 పరుగులు. దీంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ చరిత్రలో టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా.. ఇంగ్లండ్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన 33 ఏళ్ల అలెస్టర్‌.. గతేడాది ఫిబ్రవరిలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. 2014లో వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కుక్‌.. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు.

ఇదే సరైన సమయం..
‘చిన్ననాటి నుంచే క్రికెట్‌ను ప్రేమిస్తున్నాను. ఇంగ్లండ్‌ జెర్సీ ఒంటిపై ధరించడం నాకొక ప్రత్యేక అనుభూతి. నాలాగే నా తరువాతి తరం కూడా ఈ అనుభూతిని ఆస్వాదించే అవకాశం రావాలి. నేను ఊహించిన దానికన్నా ఎక్కువే సాధించాను. దిగ్గజాలతో కలిసి ఇన్నాళ్లు ప్రయాణం కొనసాగించాను. ఇక సాధించాల్సిందేమీ లేదని భావిస్తున్నాను. అందుకే ఈ సమయంలో రిటైర్మెంట్‌ ప్రకటించడం సరైనదిగా భావిస్తున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు తోడుగా, మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’ అని కుక్‌ వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు