బ్రాడ్మన్ తో నన్ను పోల్చవద్దు...

23 Jul, 2016 12:21 IST|Sakshi
బ్రాడ్మన్ తో నన్ను పోల్చవద్దు...

టెస్టుల్లో 29వ సెంచరీ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్

మాంచెస్టర్: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటింగ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ టెస్టు క్రికెట్ లో మరో మైలురాయిని చేరుకున్నాడు. ఆసీస్ మాజీ దిగ్గజం బ్రాడ్ మన్ రికార్డు సెంచరీలను సమం చేశాడు. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 314 పరుగులు సాధించింది. జో రూట్ (246 బంతుల్లో 141 బ్యాటింగ్; 18 ఫోర్లు)తో పాటు కెప్టెన్ అలిస్టర్ కుక్ (172 బంతుల్లో 105; 15 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు.

ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ టెస్టుల్లో 29వ శతకాన్ని నమోదుచేశాడు. ఈ సెంచరీతో క్రికెట్ ఆల్ టైమ్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సర్ డాన్ బ్రాడ్మన్ రికార్డును కుక్ సమంచేశాడు. అయితే బ్రాడ్మన్ తో పోల్చి చూసేంత గొప్ప ఆటగాడిని కాదని కుక్ పేర్కొన్నాడు. ఆయనకు ఈ ఘనత సాధించేందుకు 52 టెస్టులే అవసరం కాగా, తాను మాత్రం ఈ రికార్డును అందుకోవడానికి 131 టెస్టులు ఆడానని చెప్పాడు. ఈ సెంచరీ చేయడానికి కుక్ 20 ఇన్నింగ్స్ లు ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు ఆమిర్, రాహత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు