కెప్టెన్సీకి కుక్‌ బైబై

7 Feb, 2017 00:59 IST|Sakshi
కెప్టెన్సీకి కుక్‌ బైబై

లండన్‌: ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ అలిస్టెర్‌ కుక్‌ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రికార్డు స్థాయిలో ఇంగ్లండ్‌ జట్టుకు 59 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ 32 ఏళ్ల వెటరన్‌ స్టార్‌ మాట్లాడుతూ ‘ఇది నాకు బాధకలిగించే రోజే కానీ... జట్టుకోసం సరైన నిర్ణయమే తీసుకున్నాను’ అని వెల్లడించాడు. సారథ్యానికి రాజీనామా చేసినా... ఆటగాడిగా కెరీర్‌ను కొనసాగిస్తానన్నాడు.

 తన రాజీనామాను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) చైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌కు ఆదివారమే అందజేశాడు. ‘ఇంగ్లండ్‌కు సారథ్యం వహించడం నాకు లభించిన గొప్ప గౌరవం. ఐదేళ్లపాటు కెప్టెన్‌గా కొనసాగాను. ఇపుడు బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం కఠినమైనప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం సరైన సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని కుక్‌ అన్నాడు.

టెస్టుల్లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కుక్‌ రికార్డులకెక్కాడు. 140 మ్యాచ్‌లాడిన కుక్‌ 11,057 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 53 అర్ధసెంచరీలున్నాయి.

కుక్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌ జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. సొంతగడ్డపై 2013, 2015లలో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ను

కైవసం చేసుకుంది. అదేజోరుతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో ఘనవిజయం సాధించింది.

2012లో ‘విజ్డెన్‌ క్రికెట్‌ అఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికైన అతను ఆ మరుసటి ఏడాదే (2013) ఐసీసీ ప్రపంచ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

మరిన్ని వార్తలు