ఆత్మవిశ్వాసంతో ఉన్నాం

2 Apr, 2014 01:18 IST|Sakshi
ఆత్మవిశ్వాసంతో ఉన్నాం

 టి20ల్లో ఫలితాన్ని ఊహించలేం
 మళ్లీ దక్షిణాఫ్రికాకు ఆడతానని అనుకోలేదు
 ఆల్బీ మోర్కెల్ ఇంటర్వ్యూ
 
 ఢాకా నుంచి బత్తినేని జయప్రకాష్
 ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ ఆల్బీ మోర్కెల్. ఇప్పటికే 259 మ్యాచ్‌లు ఆడాడు. భారీ హిట్టింగ్ చేయగల సామర్థ్యం, నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగల నైపుణ్యంతో ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్‌కు ప్రపంచ వ్యాప్తంగా టి20ల్లో భారీ డిమాండ్ ఉంది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ ఆరేళ్లు ధోనితో పాటు ఆల్బీనీ కొనసాగించింది. ఈసారి మాత్రం కొనసాగించలేదు. ఐపీఎల్-7 కోసం జరిగిన వేలంలో బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.
 
  అయితే రెండేళ్ల క్రితం టి20 ప్రపంచకప్ తర్వాత ఆల్బీ మోర్కెల్‌కు దక్షిణాఫ్రికా జట్టులో చోటు పోయింది. కొత్త వాళ్లు, యువకుల కోసం 32 ఏళ్ల మోర్కెల్‌ను పక్కనబెట్టారు. అయితే టి20 ప్రపంచకప్‌కు అతని అనుభ వం ఎంత అవసరమో దక్షిణాఫ్రికా బోర్డు ఆలస్యంగానైనా మళ్లీ గుర్తించింది. దీంతో ఈసారి బంగ్లాదేశ్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకూ ఎన్నడూ ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని లోటును సఫారీ జట్టు తీర్చుకోవాలని భావిస్తోంది. టోర్నీ గెలవగలమనే ఆత్మవిశ్వాసం తమలో ఉందంటున్న ఆల్బీ మోర్కెల్ ఇంటర్వ్యూ ‘సాక్షి’కి ప్రత్యేకం.
 
 ఈ టోర్నీలో ఇప్పటివరకూ మీ ప్రదర్శన సంతృప్తినిచ్చిందా?
 వరుసగా మూడు విజయాలు సాధించాం. అయితే అందులో రెండు మ్యాచ్‌లు ఆఖరి వరకూ పోరాడి గెలిచాం. సాధారణంగా అలాంటి మ్యాచ్‌లు గెలిచినప్పుడు ఊరట వస్తుంది. దానితో పాటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగతంగా మాత్రం నా ప్రదర్శన ఇంకా మెరుగుపడాలి.
 సెమీస్‌లో భారత్‌లాంటి పటిష్టమైన జట్టుతో ఆడబోతున్నారు. ఈ మ్యాచ్‌పై కామెంట్?
 ఈ టోర్నమెంట్‌లో భారత్ అద్భుతంగా ఆడుతోంది. కాబట్టి మేం మా పూర్తి సామర్థ్యంతో పోరాడాల్సి ఉంటుంది.
 
 ఫైనల్‌కు చేరతామన్న నమ్మకం ఉందా?
 ఏ జట్టుకైనా నమ్మకం కచ్చితంగా ఉంటుంది. టి20ల్లో ఫలితాన్ని అంచనా వేయలేం. ఒక్క ఓవర్‌లోనే మ్యాచ్ స్వరూపం, ఫలితం కూడా మారిపోతుంది. ఏ జట్టుతో ఆడినా పూర్తి సామర్థ్యంతో ఆడటం ఒక్కటే ముఖ్యం.
 
 దక్షిణాఫ్రికా జట్టు ఏ పెద్ద టోర్నీలోనూ ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. ఆ లోటు బాధిస్తుందా?
 చాలా టోర్నీల్లో మేం మంచి క్రికెట్ ఆడాం. టోర్నీ అంతటా బాగా ఆడినా ఒక్కరోజు వైఫల్యం వల్ల మ్యాచ్‌లు పోయాయి. ఈసారి గెలవగలమనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాం.
 సాధారణంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా తరచూ విఫలమవుతుంటుంది. దీనికి ఒత్తిడే కారణమా?
 నాకౌట్ అనే కాదు... ప్రతి మ్యాచ్‌లోనూ ఒత్తిడి ఉంటుంది. దీనిని ప్రొఫెషనల్ క్రికెటర్లు కచ్చితంగా అధిగమించాలి. ఈసారి మ్యాచ్‌లు ఒత్తిడిలోనే గెలిచామన్న విషయం గుర్తుంచుకోవాలి.
 టి20 స్పెషలిస్ట్ అనే ముద్ర వల్ల కెరీర్‌లో పెద్దగా టెస్టులు ఆడలేదు. దీని గురించి ఎప్పుడైనా బాధపడ్డారా? చివరి ఓవర్లలో వచ్చి మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేయడం సమస్య కాదా?
 ప్రతి క్రికెటర్ తన సామర్థ్యం ఏమిటనేది తెలుసుకోగలగాలి. అప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండదు. నా బలం టి20 అయినప్పుడు నేను టెస్టుల గురించి ఆలోచించడం అనవసరం. ఇక చివరి ఓవర్లలో వచ్చి మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఎక్కువసార్లు విఫలమవుతాం. ఇది మానసికంగా బాధిస్తుంది. దీనిని అధిగమిస్తేనే సక్సెస్ లభిస్తుంది.
 
 తిరిగి దక్షిణాఫ్రికా జట్టులోకి వస్తానని ఊహించారా?
 నిజాయితీగా చెప్పాలంటే లేదు. నా అంతర్జాతీయ కెరీర్ ముగిసిందని నేను ఫిక్సయ్యాను. కానీ ఈసారి దేశవాళీ క్రికెట్‌లో బాగా ఆడటం వల్ల ఈ పిలుపు వచ్చింది. నిజానికి నేను మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపికయ్యానని తెలియగానే ఆశ్చర్యపోయాను. అయితే నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా బాధ్యత.
 

మరిన్ని వార్తలు