లెక్క తప్పిన ఫీల్డ్‌ అంపైర్‌..!

15 Feb, 2019 12:03 IST|Sakshi

డర్బన్‌: అంపైర్‌ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి(డీఆర్‌ఎస్‌) మరోసారి వివాదాస్పమైంది. ఇటీవల భారత్‌తో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్‌ ఆటగాడు డార్లీ మిచెల్‌ ఎల్బీగా ఔటైన తీరు అనేక ప్రశ్నలకు తావిచ్చింది. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో ఆరో ఓవర్‌లో మిచెల్ (1) ఎల్బీగా వెనుదిరిగాడు. మొదట అంపైర్ క్రిస్‌ బ్రౌన్‌..  మిచెల్ ఔట్ అని ప్రకటించాడు. ఆపై అవతలి ఎండ్‌లో ఉన్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సంప్రదించిన తర్వాత మిచెల్ డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. హాట్ స్పాట్‌లో బ్యాట్‌కు బంతి తగిలినట్లు చూపించగా, స్నికో మీటర్‌లో దీనికి విరుద్దంగా కనిపించింది. బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్‌ కనిపించలేదు. దాంతో బాల్‌ ట్రాకింగ్‌ ఆధారంగా థర్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. ఇది వివాదాస్పమైంది.

తాజాగా డీఆర్ఎస్‌పై ఫీల్డ్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ చేసిన తప్పిదం హాట్‌ టాపిక్‌ అయ్యింది. డర్బన్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు  దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో విశ్వ ఫెర్నాండో వేసిన రెండో ఓవర్‌లోనే సఫారీ ఓపెనర్ డీన్‌ ఎల్గర్‌ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత అదే ఓవర్‌లో మరొక బంతి నేరుగా హషీమ్‌ ఆమ్లా ప్యాడ్లకు తాకింది.  అయితే ఎల్బీ కోసం ఫెర్నాండో అప్పీల్‌ చేయగా ఫీల్డ్ అంఫైర్ అలీమ్‌ దార్‌ దానిని తిరస్కరించాడు. బౌలర్‌, ఇతర ఆటగాళ్లతో చర్చించాక శ్రీలంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే డీఆర్‌ఎస్‌ కోరాడు. అయితే, అప్పటికే సమయం మించిపోయిందన్న కారణంతో దార్‌ రివ్యూకు ఒప్పుకోలేదు.

ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి డెడ్‌ అయ్యాక 15 సెకండ్ల లోపు సమీక్ష కోరాలి. కాగా, 10 సెకన్లు ముగిశాక బౌలర్‌ ఎండ్‌లో ఉన్న అంపైర్‌.. డీఆర్‌ఎస్‌ సమయాన్ని గుర్తు చేయాలి. కానీ, అలీమ్‌ దార్‌ ఎలాంటి హెచ్చరిక చేయకపోవడం... శ్రీలంక కెప్టెన్‌ నిర్ణీత సమయంలో అప్పీల్‌ చేసినా తిరస్కరించడం ఇప్పుడు వివాదంగా మారింది. శ్రీలంక రివ్యూ కోరే సమయానికి 13.79 సెకన్లు మాత్రమే అయ్యింది. అంటే దాదాపు సెకనకుగా పైగా సమయముంది. దాంతో డీఆర్‌ఎస్‌ సమయాన్ని లెక్కించడంలో అంపైర్‌ తప్పుచేశాడంటూ విమర్శల వర్షం కురుస్తోంది.

మరిన్ని వార్తలు