మ్యాచ్‌ అంటే ఇది.. జట్టులోని సభ్యులంతా డకౌట్‌

21 Nov, 2019 16:07 IST|Sakshi

ముంబై:  క్రికెట్‌లో అద్భుతాలు జరగడం అంటే ఇదేనేమో. క్రికెట్‌లో ఎక్కువ మంది డకౌటైతేను ఇదేం బ్యాటింగ్‌రా అనుకుంటాం. కానీ మొత్తం జట్టులోని సభ్యులంతా సున్నాకే పరిమితమైతే ఏమనుకోవాలి. మ్యాచ్‌ అంటే ఇదీ అనుకోవడం తప్పితే ఏం చేస్తాం. ఇప్పుడు అదే జరిగింది. అది ఏ స్థాయి మ్యాచ్‌ అయినా కానీ  వచ్చిన బ్యాట్స్‌మన్‌ వచ్చినట్లు డకౌట్‌గా పెవిలియన్‌కు వెళ్లిపోతే ఏమవుతుంది. ఘోర పరాజయం ఎదరవుతుంది. అలా క్రికెట్‌ చరిత్రలోనే ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది చిల్డ్రన్స్‌ అకాడమీ అంథేరీ  స్కూల్‌ టీమ్‌.

హార్రిస్‌ షీల్డ్‌ అండర్‌-16 టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం ఆజాద్‌ మైదానంలో స్వామి వివేకానంద ఇంటర్నేషనల్‌ స్కూల్‌ బోరివాలీతో జరిగిన మ్యాచ్‌లో చిల్డ్రన్స్‌ అకాడమీ అంధేరీ జట్టు 754 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వారు ఛేదించాల్సిన లక్ష్యం 761 పరుగులు కాగా, కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. అవి కూడా ఎక్స్‌ట్రాల రూపంలో రావడం గమనార్హం. మొత్తం జట్టంతా సున్నాకే చాపచుట్టేసి ఘోర పరాభవాన్ని చవిచూసింది.

ఓపెనర్లు మొదలుకొని కడవరకూ డకౌట్లనే కొనసాగించింది అంథేరీ చిల్డ్రన్స్‌ జట్టు. స్వామి వివేకానంద బౌలర్లలో అలోక్‌ పాల్‌ ఆరు వికెట్లతో  అంథేరీ డకౌట్ల పతనాన్ని శాసించగా, వరాద్‌ వాజే రెండు వికెట్లు తీశాడు. ఇక రెండు రనౌట్ల రూపంలో వచ్చాయి.  ముందుగా బ్యాటింగ్‌ చేసిన వివేకానంద ఇంటర్నేషనల్‌ బొరివాలీ జట్టు  39 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 605 పరుగులు చేసింది. వివేకానంద ఇంటర్నేషనల్‌ బొరివాలీ మయేకర్‌ (338) ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. కాగా, 45 ఓవర్లను అంథేరీ జట్టు నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోవంతో 156 పరుగుల పెనాల్టీ పడింది. దాంతో అంథేరీ లక్ష్యం 761 పరుగులు అయ్యింది.

>
మరిన్ని వార్తలు