టోక్యో బెర్త్‌కు రెండు విజయాలే... 

7 Mar, 2020 10:27 IST|Sakshi

 క్వాలిఫయింగ్‌ పోటీలకు సిద్ధమైన మేరీకోమ్‌

 ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీ  

న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్, మణిపూర్‌కు చెందిన మేరీకోమ్‌ (51 కేజీలు) రెండోసారి ఒలింపిక్స్‌ బెర్త్‌ ఒడిసి పట్టేందుకు సన్నద్ధమైంది. లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన మేరీ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనే ధ్యేయంగా కఠిన ప్రాక్టీస్‌తో సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌లో జరుగుతోన్న ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ ఈవెంట్‌లో రాణించి టోక్యో బెర్తును సాధించాలనే పట్టుదలతో మేరీ బరిలో దిగనుంది. పురుషుల విభాగంలో అమిత్‌ పంఘాల్‌ (52 కేజీలు) కూడా ఈ క్వాలిఫయర్స్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. 

ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన 37 ఏళ్ల మేరీకోమ్‌ ఈ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో రెండో సీడ్‌గా బరిలో నిలిచింది. తొలి రౌండ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన తస్మిన్‌ బెన్నీతో తలపడుతుంది. ఈ టోర్నీలో రెండు విజయాలు సాధిస్తే ఆమెకు ఒలింపిక్స్‌ బెర్తు ఖరారు అవుతుంది. ఆమె కచ్చితంగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుందని భారత మహిళల బాక్సింగ్‌ కోచ్‌ రాఫెలె బెర్గామస్కో అన్నారు. ‘ఇవే తనకు చివరి ఒలింపిక్స్‌ అని మేరీకి తెలుసు. అందుకే ఈ మెగా ఈవెంట్‌లో స్వర్ణం సాధించి తన కలను నిజం చేసుకోవాలని ఆమె శ్రమిస్తోంది. కఠిన ప్రాక్టీస్‌ చేస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చరిత్రాత్మక రజతం సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్న అమిత్‌ పంఘాల్‌కు తొలిరౌండ్‌లో ‘బై’ లభించింది. రెండో రౌండ్‌లో మంగోలియా బాక్సర్‌ ఎన్‌ఖ్‌మనదక్‌ ఖర్‌ఖుతో తలపడతాడు.   
 

మరిన్ని వార్తలు