హైదరాబాదీ ఒమన్‌ క్రికెటర్‌

27 Apr, 2019 00:55 IST|Sakshi

ఆల్‌రౌండర్‌ సందీప్‌ గౌడ్‌ అనూహ్య ప్రస్థానం

రంజీ జట్టులో చోటు దొరక్క విదేశానికి పయనం

పరాయి గడ్డపై కీలక సమయంలో రాణింపుతో పేరు  

ఆ కుర్రాడి కల టీమిండియాకు ఆడటం... ఆ లక్ష్యానికి తగ్గట్లుగానే అడుగులు వేశాడు... ఆ దిశగా ఒక్కో మెట్టు ఎక్కాడు... అవకాశం దొరికినప్పుడల్లా రాణించాడు... కానీ, తాను ఊహించినంతగా ముందుకు వెళ్లలేకపోయాడు... ఈలోగా తండ్రి మరణం రూపంలో వ్యక్తిగత జీవితంలో విషాదం ఎదురైంది... నిరాశ చుట్టుముట్టిన వేళ అనుకోని వరంలా ఓ పిలుపు తలుపు తట్టింది... ఏదైనా మన మంచికే అని దానిని అందిపుచ్చుకున్నాడు...! వెనక్కుతిరిగి చూసుకుంటే ఇప్పుడు అతడు తమ జట్టుకు కీలక సమయంలో విజయం అందించిన ‘ఓ జాతీయ క్రికెటర్‌’...! అతడే... హైదరాబాదీ ఆల్‌ రౌండర్, ఒమన్‌ దేశ క్రికెటర్‌ శ్రీమంతుల సందీప్‌ గౌడ్‌! మన తెలుగువాడు కావడం ఏమిటి? ఎక్కడో గల్ఫ్‌లోని దేశానికి ప్రాతినిధ్యం ఏమిటి? ఈ ఆసక్తికర కథనం మీరే చదవండి...!      

మనదగ్గరి చాలామంది యువకుల్లాగే సందీప్‌ గౌడ్‌ కూడా క్రికెట్‌ అంటే ప్రాణమిచ్చే రకం. దీనికితోడు హైదరాబాద్‌ నేపథ్యం. పైగా దిగ్గజ బ్యాట్స్‌మన్, భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ చదివిన ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌ విద్యార్థి. అతడితోపాటు మరో మేటి ఆటగాడైన వీవీఎస్‌ లక్ష్మణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. 

అడుగులు ఇలా... 
స్కూల్‌ స్థాయిలో ప్రతిభ చాటాక సందీప్‌ చిక్కడపల్లిలోని అరోరా కళాశాలలో బీకామ్‌ చదువుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయ జట్టుకు ఎంపికయ్యాడు. 2009–10 సీజన్‌లో అండర్‌–22 కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ నెగ్గిన హైదరాబాద్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గానూ నిలిచాడు. ఇదే సీజన్‌లో అండర్‌–19 కూచ్‌ బెహార్‌ ట్రోఫీ, వినూ మన్కడ్‌ ట్రోఫీల్లో హైదరాబాద్‌కు ఆడాడు. 2010–11లో కాన్పూర్‌లో జరిగిన అఖిల భారత అంతర్‌ విశ్వవిద్యాలయ టోర్నీలో ప్రాతినిధ్యం వహించాడు. ఈ మధ్యలో హెచ్‌సీఏ ‘ఎ’ డివిజన్‌ లీగ్‌ చాంపియన్‌షిప్స్‌లో దక్కన్‌ క్రానికల్, న్యూ బ్లూస్, ఎవర్‌ గ్రీన్‌ క్లబ్‌లకు ఆడాడు. ఇలా వివిధ స్థాయిల్లో ప్రతిభ చాటుతూ 2013 నుంచి రంజీ ట్రోఫీ అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. 2016లో చాన్స్‌ దొరుకుతుందని భావించినా ఆ ఆశ నెరవేరలేదు. 

తండ్రి ఆకస్మిక మరణంతో... 
ఇదే సమయంలో తండ్రి రవీందర్‌ గౌడ్‌ ఆకస్మిక మృతి సందీప్‌ను మరింత ఒంటరి చేసింది. అయితే, అనుకోని విధంగా తనతో కలిసి ఆడిన స్నేహితుడు వంశీ నుంచి సందీప్‌కు ఒమన్‌ అవకాశం గురించి తెలిసింది. తొలుత తటపటాయించినా, వయసు, ఇతర పరిమితులు సడలిస్తూ  ఒమన్‌ అధికారులు సైతం ఆహ్వానించడంతో ఓ ప్రయత్నం చేద్దామని నిర్ణయానికొచ్చాడు. మరోవైపు ఒమన్‌లోని ఖిమ్జి రామ్‌దాస్‌ కంపెనీ సందీప్‌కు ఇమ్మిగ్రేషన్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం ఇచ్చింది.  

ఆ కల ఇలా తీరింది... 
ఒమన్‌ డెవలప్‌మెంట్‌ ఎలెవెన్‌ తరఫున ఐర్లాండ్‌పై ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రాణించడంతో (55 నాటౌట్‌) సందీప్‌ ఆ దేశ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. నెదర్లాండ్స్‌తో అరంగేట్ర మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన అతడు రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 19 బంతుల్లోనే 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐసీసీ వరల్డ్‌ క్రికెట్‌ లీగ్‌ డివిజన్‌–2లో గత బుధవారం నమీబియాతో మ్యాచ్‌లో కీలక సమయంలో అజేయ అర్ధ సెంచరీతో రాణించి తమ జట్టుకు ఐసీసీ వన్డే హోదా దక్కేలా చేశాడు. ఈ ప్రతిభతో సందీప్‌ త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే ఐసీసీ టి20 ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లోనూ ఒమన్‌ జట్టుకు ఆడటం ఖాయం చేసుకున్నాడు. ‘సందీప్‌ బంతితో, బ్యాట్‌తో నిలకడైన ప్రదర్శన చేస్తాడు. దురదృష్టం కొద్దీ ఇక్కడ అవకాశం దొరకలేదు. అతడు ఒమన్‌కు ఆడుతుండటాన్నీ నేను సంతోషంగానే స్వీకరిస్తున్నా’ అని ఆల్‌ సెయింట్స్‌ కోచ్‌ డెంజిల్‌ బామ్‌ అన్నాడు. ‘ఇక్కడి టోర్నీల్లో తన ప్రదర్శనతో మా సోదరుడు మంచి భవిష్యత్తు ఊహించుకున్నాడు. కానీ, అవకాశం దక్కలేదు’ అని సందీప్‌ సోదరి శ్రావణి పేర్కొంది.   
– సాక్షి క్రీడా విభాగం  

మరిన్ని వార్తలు