టీఎన్‌పీఎల్‌లో ఫిక్సింగ్‌!

17 Sep, 2019 02:15 IST|Sakshi

బీసీసీఐ విచారణలో వెల్లడి  

న్యూఢిల్లీ: మూడేళ్లలో అత్యంత విజయవంతమైన క్రికెట్‌ టోరీ్నగా పేరు తెచ్చుకున్న తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం అలజడి రేపింది. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణలో ఈ విషయం బయటపడినట్లు సమాచారం. కొందరు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్లతో పాటు ఇద్దరు కోచ్‌లు కూడా ఫిక్సింగ్‌లో భాగంగా ఉన్నారని తెలుస్తోంది. 2016లో ప్రారంభమైన టీఎన్‌పీఎల్‌ను ఎనిమిది ఫ్రాంచైజీ జట్లతో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరి పేర్లూ బయటపడకపోయినా... ఒక జట్టు విషయంలో మాత్రం సందేహాలున్నాయి. ‘టీఎన్‌పీఎల్‌లో ఆ జట్టు చివరి మూడు స్థానాల్లో ఒకటిగా నిలిచింది. ఆ జట్టు యాజమాన్యం నిర్వహణా శైలి, వారి ఆటగాళ్లు, కోచ్‌ల ఎంపిక కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ముఖ్యంగా ఒక కోచ్‌ పాత్ర గురించి బోర్డు ప్రత్యేకంగా విచారిస్తోంది. ‘గతంలో ఐపీఎల్‌లో చెడ్డ పేరు తెచ్చుకున్న ఫ్రాంచైజీతో కూడా ఆ కోచ్‌ కలిసి పని చేశాడు. ఆ తర్వాత ఒక రంజీ టీమ్‌కు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. కనీసం ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కూడా ఆడని అతను ఐపీఎల్‌ సహాయక సిబ్బందిలో ఎలా అవకాశం దక్కించుకున్నాడో, టీఎన్‌పీఎల్‌తో ఎలా జత కలిశాడో కూడా కూడా ఆశ్చర్యకరం’ అని ఆయన చెప్పారు. మరో వైపు ఈ వివాదంలో అంతర్జాతీయ క్రికెటర్లు ఎవరూ లేరని ఏసీయూ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ స్పష్టం చేశారు.  ఒక భారత క్రికెటర్‌ ఉన్నాడంటూ తమకు కొన్ని వాట్సప్‌ మెసేజ్‌లు వచ్చాయంటూ కొందరు ఆటగాళ్లు తమ విచారణలో వెల్లడించారని... ఆయా సందేశాలను తాము పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు.   

మహిళల క్రికెట్‌లోనూ..
భారత మహిళల క్రికెట్‌ జట్టు సభ్యురాలు ఒకరిని కూడా మ్యాచ్‌ ఫిక్సింగ్‌లోకి దించేందుకు బుకీలు ప్రయతి్నంచినట్లు తెలిసింది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సదరు క్రికెటర్‌ వెంటనే బీసీసీఐ ఏసీయూకు సమాచారం అందించింది. దీనికి సంబంధించి సోమవారం బెంగళూరులో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వీరిలో జితేంద్ర కొఠారి ముందుగా తనను తాను స్పోర్ట్స్‌ మేనేజర్‌గా చెప్పుకొని మహిళా క్రికెటర్లతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత తన మిత్రుడంటూ రాకేశ్‌ బాఫ్నా అనే వ్యక్తిని ముందుకు తీసుకొచ్చాడు. ఫిక్సింగ్‌ చేయాలంటూ మహిళా క్రికెటర్‌ ముందు ఇదే బాఫ్నా ప్రతిపాదన తీసుకొచ్చాడని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరిపై నాలుగు వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే ఈ భారత మహిళా క్రికెటర్‌ ఎవరనేది  బయటకు రాలేదు.   

>
మరిన్ని వార్తలు