అలీసన్ ఫెలిక్స్ నవ చరిత

21 Aug, 2016 15:35 IST|Sakshi
అలీసన్ ఫెలిక్స్ నవ చరిత

రియో డీ జనీరో:అమెరికా మహిళా స్ప్రింటర్ అలీసన్ ఫెలిక్స్ కొత్త చరిత్ర సృష్టించింది.  ఒలింపిక్స్లో ఆరు స్వర్ణాలను తన ఖాతాలో వేసుకున్న తొలి మహిళా అథ్లెటిక్గా నవ చరితను లిఖించింది. రియో ఒలింపిక్స్లో భాగంగా 4x 400 రిలేలో అమెరికా జట్టు అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం సాధించింది. అలీసన్ ఫెలిక్స్, కర్ట్నీ ఒకోలో, నతాషా హెస్టింగ్స్, ఫిల్లిస్ ఫ్రాన్సిస్లతో కూడిన అమెరికా బృందం ఈ  రేసును 3:19:06 నిమిషాల్లో పూర్తి చేసి పసిడిని ముద్దాడింది.

 

తద్వారా అలీసన్ ఫెలిక్స్ ఖాతాలో ఆరో స్వర్ణం చేరింది. దీంతో ఒలింపిక్స్ లో ఆరు స్వర్ణాలు సాధించిన ఏకైక మహిళా అథ్లెట్గా ఫెలిక్స్ నిలిచింది.  బీజింగ్ ఒలింపిక్స్ లో 4x 400 రిలేలో స్వర్ణం సాధించిన ఫెలిక్స్.. లండన్ ఒలింపిక్స్లో 200 మీటర్ల వ్యక్తిగత విభాగంలో, 4x 100, 4x 400 పరుగులో స్వర్ణాలను సాధించింది. తాజాగా ఒలింపిక్స్  మహిళల 4x100 రేసులో పసిడి సాధించిన అమెరికా.. 4x 400 రిలేలో కూడా విజేతగా నిలవడంతో ఫెలిక్స్ 'సిక్సర్' కొట్టింది.


దాంతో పాటు  ఒలింపిక్స్ లో అమెరికా మహిళల జట్టుకు  4x 400 రిలేలో ఇది వరుసగా ఆరో స్వర్ణం. దాదాపు 20 ఏళ్ల క్రితం ఈ విభాగంలో పసిడి ఖాతా ఆరంభించిన అమెరికా మహిళలు ఇప్పటికే సత్తా చాటుతూనే ఉండటం విశేషం. ఇదిలా ఉండగా జమైకా మహిళల జట్టు రెండో స్థానంతో రజతం, బ్రిటన్ కాంస్య పతకాలను దక్కించుకున్నాయి.

>
మరిన్ని వార్తలు