‘ఆమెది లక్కీ హ్యాండ్‌.. అందుకే తీసుకొచ్చా’

30 Sep, 2019 18:12 IST|Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో శ్రీలంక మహిళా జట్టు సారథి చమరీ ఆటపట్టు సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. కేవలం 66 బంతుల్లోనే శతకం సాధించిన తొలి లంక మహిళా క్రికెటర్‌గా.. వన్డే, టీ20ల్లో ఆసీస్‌ సెంచరీ నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా ఆటపట్టు అరదైన రికార్డును నెలకొల్పింది. ఆదివారం స్థానిక నార్త్‌ సిడ్నీ ఓవల్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డులను ఆటపట్టు తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇదే మ్యాచ్‌లో టాస్‌ సమయంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.

 

సాధారణంగా మ్యాచ్‌లో టాస్‌ వేసేటప్పుడు ఇరుజట్ల కెప్టెన్లు వస్తారు. కానీ నిన్నటి మ్యాచ్‌లో ఆసీస్‌ సారథి మెగ్‌ లానింగ్‌  కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తనకు టాస్‌ కలసి రావడం లేదని వికెట్‌ కీపర్‌ అలిస్సా హీలేను వెంటబెట్టుకొని వచ్చింది. మ్యాచ్‌ రిఫరీ కాయిన్‌ను హీలేకు ఇచ్చి టాస్‌ వేయమన్నాడు. అయితే అనూహ్యంగా ఆసీస్‌ టాస్‌ గెలిచింది. అనంతరం హీలే పక్కకు తప్పుకోవడంతో రెగ్యులర్‌ కెప్టెన్‌ లానింగ్‌ వచ్చి తొలుత బ్యాటింగ్‌ చేయనున్నట్లు ప్రకటించింది.  ఇక టాస్‌ గెలవడంతో హీలే మైదానంలో గంతులు వేసింది.  

అయితే ఈ విషయంపై మెగ్‌ లానింగ్‌ స్పందిస్తూ.. ‘గత కొన్ని రోజులుగా నేను టాస్‌ గెలవడం లేదు. బహుశా నాకు అదృష్టం కలసి రావడం లేదనుకుంటా. అందుకే అలిస్సా హీలేను వెంటబెట్టుకొని వచ్చాను. లక్కీగా మేమే టాస్‌ గెలిచాం. నాకు తెలుసు హీలేది లక్కీ హ్యాండ్‌ అని’పేర్కొంది.  ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 41 పరుగుల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం టాస్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగహల్‌చల్‌ చేస్తోంది. 

మరిన్ని వార్తలు