గిన్నీస్‌ రికార్డు సాధించిన వికెట్‌ కీపర్‌

21 Feb, 2019 14:35 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు వికెట్‌ కీపర్‌ అలిస్సా హీలే గురువారం గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పారు. డ్రోన్ల సహాయంతో 80 మీటర్ల ఎత్తు నుంచి విసిరిన బంతిని కళ్లుచెదిరే రీతిలో ఒడిసిపట్టుకోవడంతో ఈ ఘనత సాధించారు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ ఫీట్‌లో క్రికెట్‌ ఆస్ట్రేలియా సభ్యులు, ఐసీసీ, గిన్నీస్‌ అధికారులు పాల్గొన్నారు. హీలే తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమవ్వగా మూడో ప్రయత్నంలో సఫలమయ్యారు. దీంతో అలిస్సా హీలేకు గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు సాధించినట్టు అధికారులు ధృవపత్రం అందించారు. అంతకముందు 64 మీట​ర్ల ఎత్తు నుంచి విసిరిన బంతిని అందుకోవడంలో విఫలమైన హీలే 80 మీటర్ల క్యాచ్‌ రికార్డును సాధించడం విశేషం. 2016లో ఈ రికార్డును ఇంగ్లండ్‌ క్రికెటర్‌ క్రిస్టన్‌ నెలకొల్పగా.. తాజాగా ఆ రికార్డును హీలే అధిగమించారు. ఇలాంటి ప్రయోగాలను తొలుత ఇంగ్లండ్‌ మాజీ సారథి నాసిర్‌ హుస్సేన్‌ ప్రయత్నించాడు. లార్డ్స్‌ మైదానంలో 49 మీటర్ల ఎత్తు నుంచి విసిరిన బంతిని అందుకున్నాడు.

చాలా సంతోషంగా ఉంది
‘ఐసీసీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా సంయుక్తంగా మహిళా క్రికెట్‌ అభివృద్దికి, పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా రికార్డులను నెలకోల్పేవిధంగా ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళల దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఈ రికార్డు సాధించడం ఆనందంగా, థ్రిల్‌గా ఉంది. దీనికి ముందు ఎలాంటి ప్రాక్టీస్‌ చేయలేదు. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న ప్రపంచకప్‌పై దృష్టి పెట్టాం’. అంటూ హీలే పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు