తొలి రౌండ్‌లో అమర్‌దీప్‌ ఆధిక్యం

7 Feb, 2019 10:30 IST|Sakshi

గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా (పీజీటీఐ) సీజన్‌ ఆరంభ టోర్నమెంట్‌ గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌లో నోయిడా ప్లేయర్‌ అమర్‌దీప్‌ మలిక్‌ శుభారంభం చేశాడు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ (హెచ్‌జీసీ) వేదికగా బుధవారం జరిగిన తొలిరౌండ్‌లో అమర్‌దీప్‌ అగ్రస్థానంలో నిలిచాడు. నిర్ణీత 71 పాయింట్లకు గానూ అతను 12 బిర్డీస్‌ సహాయంతో 9 అండర్‌ 62 పాయింట్లు స్కోర్‌ చేశాడు. ఈ క్రమంలో అతను రెండుసార్లు గోల్కొండ మాస్టర్స్‌ టోర్నీ చాంపియన్‌ అజితేశ్‌ సంధు కోర్స్‌ రికార్డును సమం చేశాడు. 2016లో అజితేశ్‌ ఈ రికార్డును నెలకొల్పాడు. తొలిరోజు ఆటను శాసించినప్పటికీ అమర్‌దీప్‌ ఆరంభంలో తడబడ్డాడు.

అతను తొలి హోల్‌ను ‘డబుల్‌ బోగే’ సహాయంతో పూర్తి చేశాడు. నిర్దేశించిన 4 స్ట్రోక్స్‌ కంటే అదనంగా రెండు స్ట్రోక్స్‌ను సంధించి తొలి హోల్‌ను పూర్తి చేశాడు. తర్వాత వరుసగా మూడు బిర్డీస్‌ను నమోదు చేసిన ఈ 33 ఏళ్ల గోల్ఫర్‌... ఐదో హోల్‌ను కూడా ‘బోగే’ సహాయంతో ముగించాడు. అనంతరం మరో తప్పిదానికి తావు ఇవ్వకుండా తొలిరౌండ్‌ను పూర్తి చేశాడు. ఇటీవలే ఆసియా టూర్‌ టోర్నీకి అర్హత సాధించిన పట్నా గోల్ఫర్‌ అమన్‌ రాజ్, బెంగళూరుకు చెందిన ఎం.ధర్మ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరిద్దరూ 7 అండర్‌ 64 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచారు. అమన్‌ రాజ్‌ 9 బిర్డీస్, 2 బోగేలు నమోదు చేయగా... ధర్మ 8 బిర్డీలు నమోదు చేశాడు. బెంగళూరుకు చెందిన చిక్కరంగప్ప 6 అండర్‌ 65 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలవగా... మాజీ చాంపియన్స్‌ అజితేశ్‌ సంధు (చండీగఢ్‌) 4 అండర్‌ 67 తో ఏడో స్థానంలో, హరేంద్ర గుప్తా (చండీగఢ్‌) ఈక్వల్‌ పర్‌తో 49వ స్థానంలో నిలిచారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఉదయన్‌ మానే (అహ్మదాబాద్‌) 68 పాయింట్లు స్కోర్‌ చేసి 19వ స్థానానికి పరిమితమయ్యాడు.   

మరిన్ని వార్తలు