క్రికెట్‌ను వదిలేస్తున్నా...

4 Jul, 2019 05:09 IST|Sakshi

రిటైర్మెంట్‌ ప్రకటించిన అంబటి రాయుడు 

అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌బై 

వరల్డ్‌ కప్‌కు ఎంపిక కాకపోవడమే కారణం! 

తెలుగుతేజం అంబటి తిరుపతి రాయుడు ఆవేదనతో తన ఆటను ముగించాడు. ఒకటి కాదు రెండు సార్లు తాజా ప్రపంచ కప్‌ జట్టులో స్థానం ఆశించి భంగపడిన అతను పూర్తిగా క్రికెట్‌కే దూరం కావాలని నిర్ణయించుకున్నాడు. అన్ని ఫార్మాట్‌లు, అన్ని స్థాయిల ఆటకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. నిలకడగా రాణించినా తనపై నమ్మకముంచని సెలక్షన్‌ కమిటీపై చేసిన ఒకే ఒక్క వ్యంగ్య వ్యాఖ్య చివరకు అతని ఆటకే చిక్కు తెచ్చింది. ఫలితంగా ఆరేళ్ల అంతర్జాతీయ కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసింది.   

భారత్‌ నుంచి వన్డేల్లో కనీసం వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లి, ధోని, రోహిత్‌ తర్వాత అత్యధిక సగటు (47.05) రాయుడుదే.

సాక్షి, హైదరాబాద్‌: భారత క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని బుధవారం బీసీసీఐకి లేఖ ద్వారా తెలియజేశాడు. ఇందులో రిటైర్మెంట్‌కు కారణాలు వెల్లడించకపోయినా... ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌ జట్టులో చోటు లభించకపోవడమే కారణమని అర్థమవుతోంది. ఏప్రిల్‌ 15న వరల్డ్‌ కప్‌ను టీమ్‌ను ప్రకటించిన సమయంలో 33 ఏళ్ల రాయుడుకు అందులో స్థానం లభించలేదు. అతనికి బదులుగా మూడు విభాగాల్లో సరైనవాడంటూ సెలక్టర్లు విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశారు. అయితే తర్వాతి రోజు ప్రకటించిన ఐదుగురు స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో రాయుడు ఉన్నాడు. ఈ కప్‌లో శిఖర్‌ ధావన్‌ గాయంతో తప్పుకోగా... సెలక్టర్లు రిషభ్‌ పంత్‌కు అవకాశం కల్పించారు. నాలుగో స్థానంలో ఆడిన విజయ్‌ శంకర్‌ గాయంతో వెనుదిరగడంతో అతనికి గతంలో పోటీగా నిలిచిన రాయుడు ఈ సారైనా తనకు స్థానం లభిస్తుందని ఆశించాడు. కానీ ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్‌ అగర్వాల్‌ వైపు భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపింది. దాంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రాయుడు ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాజా ప్రకటనతో రాయుడు ఇకపై ఐపీఎల్‌ల్లోనూ కనిపించే అవకాశం లేదు. 

నేను ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అన్ని ఫార్మాట్‌లు, అన్ని స్థాయిలకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా. క్రికెట్‌తో నా పాతికేళ్ల ప్రయాణం చాలా బాగా సాగింది. వేర్వేరు దశల్లో ఒడిదుడుకులు ఎదురైనా ఎంతో నేర్చుకునే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించి, మద్దతుగా నిలిచిన బీసీసీఐకి... కెప్టెన్లు ధోని, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు... రంజీ క్రికెట్‌ ఆడే అవకాశం ఇచ్చిన హైదరాబాద్, ఆంధ్ర, బరోడా, విదర్భ అసోసియేషన్లకు, ఐపీఎల్‌ టీమ్‌లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యాలకు... నా కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నా. 
– బీసీసీఐకి పంపిన లేఖలో అంబటి రాయుడు

అంబరమంత ప్రతిభ ఉన్నా...
 ‘పదేళ్ల పాటు దేశవాళీ క్రికెట్‌ ఆడిన తర్వాత కూడా అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కోలేకపోయాననే నిరాశలో నేను ఉండదల్చుకోలేదు. ఇక్కడ ఆడితే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతా. ఇప్పుడు జనం నా ఆటను టీవీలో చూస్తారు. నేనేంటే అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఏదో ఒక రోజు భారత్‌కు ఆడకపోను’... 2007లో ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌ (ఐసీఎల్‌)లో చేరే సమయంలో రాయుడు చెప్పిన మాటలు ఇవి. హైదరాబాద్‌ క్రికెట్‌ అధమ స్థాయికి చేరి యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి రాకుండా పోతున్న సమయంలో 22 ఏళ్ల రాయుడు ఎంచుకున్న దారి ఇది. ఐసీఎల్‌ వల్ల ఉపయోగం లేదని తెలిసిన తర్వాత హైదరాబాద్‌ టీమ్‌ను వదిలి బరోడా బాట పట్టింది కూడా టీమిండియాలో చోటుపై ఆశలతోనే. చివరకు 12 ఏళ్ల ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌ తర్వాత కానీ అతని కల నెరవేరలేదు. ఎప్పుడో భారత్‌కు ఆడతాడని భావించిన రాయుడు దాదాపు 28 ఏళ్ల వయసులో 2013 జూలైలో సీనియర్ల గైర్హాజరులో తొలి సిరీస్‌ ఆడాడు. తన 55 వన్డేల స్వల్ప కెరీర్‌లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని అతను సమర్థంగా వాడుకున్నాడు. ఓపెనింగ్‌ నుంచి 7వ స్థానం వరకు బరిలోకి దిగాడు. గత రెండేళ్లలో మరింత నిలకడగా ఆడి స్థానం ఖాయం చేసుకున్న తర్వాత 2019 ప్రపంచ కప్‌ జట్టులో భాగం కావాలనే అతని కల మాత్రం అనూహ్యంగా కుప్పకూలింది. 2015 ప్రపంచ కప్‌ జట్టులో ఉన్నా రాయుడుకి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం మాత్రం రాలేదు.  

టీనేజర్‌గా ఉన్నప్పుడు రాయుడు మరో సచిన్‌ అవుతాడని చాలా మంది భావించారు. చూడచక్కటి బ్యాటింగ్‌ శైలి, చక్కటి స్ట్రోక్‌మేకర్‌గా రాయుడు బ్యాటింగ్‌లో ప్రత్యేక ఆకర్షణ కనిపించింది. 2002లో అండర్‌–19 ఆటగాడిగా ఇంగ్లండ్‌పై వన్డేలో 177 పరుగులు చేసినప్పుడు అతని ప్రతిభ ఏమిటో అందరికీ తెలిసింది. 2004 అండర్‌–19 ప్రపంచ కప్‌లో అతను భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ టీమ్‌లో ఇర్ఫాన్‌ పఠాన్, సురేశ్‌ రైనా, దినేశ్‌ కార్తీక్, ధావన్‌ సభ్యులుగా ఉన్నారు! ఆ తర్వాత రంజీ ట్రోఫీలో రాణిస్తే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్న స్థితిలో అతను పదేపదే విఫలమయ్యాడు. పైగా వరుస వివాదాలు, గొడవలు రాయుడు ఆటను దెబ్బ తీశాయి. 2007లో ఐసీఎల్‌లోకి వెళ్లడంతో అతని కెరీర్‌కు ఒక్కసారిగా బ్రేక్‌ పడింది. అయితే బీసీసీఐ క్షమాభిక్షతో మళ్లీ అవకాశం దక్కించుకున్న అతను బరోడా రంజీ జట్టులో చేరడంతో అతని జీవితం మరో మలుపు తిరిగింది. 2010 ఐపీఎల్‌లో రాయుడును సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్‌ అతని ఆటతో సంతృప్తి చెంది వరుసగా ఎనిమిదేళ్ల పాటు కొనసాగించింది. మూడు టైటిల్స్‌ విజయాల్లో భాగమైన రాయుడు ఐపీఎల్‌తోనే క్రికెట్‌ ప్రపంచం దృష్టిలో మళ్లీ పడ్డాడు. గత రెండేళ్లు చెన్నై తరఫున ఆడిన అంబటి మరోసారి చాంపియన్‌గా నిలిచిన టీమ్‌లో భాగమయ్యాడు.  

వివాదాలతోనే సమస్య... 
వ్యక్తిగతంగా ఆవేశం కొంత ఎక్కువగా ఉండటం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం కూడా రాయుడు కెరీర్‌లో ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. హైదరాబాద్‌ రంజీ ఆటగాడిగా ఉన్నప్పుడు కోచ్‌లు రాజేశ్‌ యాదవ్, వివేక్‌ జైసింహలతో గొడవలు, అనంతపురంలో అర్జున్‌ యాదవ్‌తో దాదాపు కొట్టుకున్నంత పరిస్థితి, మైదానంలో కూడా నియంత్రించుకోలేని దుందుడుకు స్వభావం, కొన్నాళ్ల క్రితం రోడ్డుపై ఒక వృద్ధుడిని దుర్భాషలాడటం రాయుడు ఇమేజ్‌ను తగ్గించాయి. అవేవీ అతను ఆటను దెబ్బ తీయలేదు కానీ రాయుడుపై ఒక ‘రెబల్‌’ ముద్ర పడిపోయింది. ‘3డి’ ట్వీట్‌ కూడా అదే తరహాలో ఆవేదన, ఆక్రోశం కలగలిపి చేసిందే. అదే ట్వీట్‌ అతడి కెరీర్‌ని ముగించిందని ఇప్పుడు సగటు క్రికెట్‌ అభిమానులందరూ నమ్ముతున్నారంటే తప్పు లేదు. రాయుడు జూనియర్‌ ఆటగాడిగా ఉన్నప్పుడు భారత్‌ కోచ్‌ ఉన్న రోజర్‌ బిన్నీ... ‘ఆట పట్ల రాయుడు అంకితభావం గొప్పది. అసలు ఓటమిని అంగీకరించేవాడు కాదు. గెలిచే మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయితే కూడా అతను ఏడ్చేశాడు. సరిగ్గా చెప్పాలంటే అండర్‌–19 స్థాయి ముగియగానే సెలక్టర్లు అతడిని ఎంపిక చేసి సరైన దిశానిర్దేశం చేయాల్సింది’ అనడం రాయుడు కెరీర్‌ గురించి ఒక్క మాటలో చెబుతుంది.   

రిటైర్మెంట్‌కు ఇలా దగ్గరై...
‘యు ఆర్‌ ఎ టాప్‌ మ్యాన్‌’... రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత రాయుడు గురించి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. అయితే అసలు సమయంలో రాయుడుపై కోహ్లి నమ్మకం కోల్పోవడమే తాజా పరిణామానికి కారణమైందనడంలో తప్పు లేదు. గత ఏడాది అక్టోబరులో ‘నాలుగో స్థానానికి సరైనవాడు’ అంటూ ప్రశంసలతో ముంచెత్తిన కెప్టెన్‌... మూడు నెలలు తిరిగే లోపే నాలుగో స్థానం ఇంకా ఖరారు కాలేదంటూ కొత్త చర్చను లేవనెత్తి రాయుడు ఆటపై సందేహాలు సృష్టించాడు. సహజమైన నైపుణ్యంతో మిడిలార్డర్‌లో సమర్థుడైన బ్యాట్స్‌మన్‌గా రాయుడు తనకు లభించిన పరిమిత అవకాశాలతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. వన్డేలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు గత నవంబర్‌లో రాయుడు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు.

ఏడాదిన్నర విరామం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన అనంతరం రాయుడు ఆసియా కప్‌లో, ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌పై చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఆస్ట్రేలియాతో 2 మ్యాచ్‌లే ఆడినా... కివీస్‌పై సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఎక్కడైనా ఆడగల సామర్థ్యం ఉందని నిరూపించేందుకు  చివరి మ్యాచ్‌లో కఠినమైన పిచ్‌పై అతను చేసిన 90 పరుగుల ఇన్నింగ్స్‌ చాలు! కానీ సెలక్టర్లు వేరేలా ఆలోచించారు. ‘3డి’ ఆటగాడు అంటూ విజయ్‌ శంకర్‌ను నాలుగో స్థానానికి తీసుకున్నారు. దాంతో సహజంగానే అసంతృప్తి చెందిన రాయుడు ‘ప్రపంచ కప్‌ చూసేందుకు ఇప్పుడే 3డి అద్దాలు కొన్నాను’ అంటూ ట్వీట్‌ చేయడం వివాదం రేపింది. నేరుగా దీనిపై బోర్డు అధికారులు ఆగ్రహం ప్రదర్శించకపోయినా... ఇప్పుడు దాని ప్రభావం కనిపించింది. రెండు సార్లు అవకాశం వచ్చినా సెలక్టర్లు ప్రపంచ కప్‌ జట్టులోకి రాయుడును మాత్రం ఎంపిక చేయలేదు. మున్ముందూ తనను ఎంపిక చేయకపోవచ్చని భావించిన రాయుడు మొత్తానికే గుడ్‌బై చెప్పేశాడు.

రాయుడు గురించి చాలా బాధపడుతున్నా. అతని రిటైర్మెంట్‌కు సెలక్టర్లే కారణం. వారి ఎంపిక పద్ధతినే తప్పు పట్టాలి. ఐదుగురు సెలక్టర్లు కలిపి కూడా రాయుడు చేసినన్ని పరుగులు చేయలేదు. కెరీర్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన అతని రిటైర్మెంట్‌ భారత క్రికెట్‌లో దుర్దినం.   
 –గౌతమ్‌ గంభీర్‌  

ప్రపంచ కప్‌కు ఎంపిక చేయకపోవడం రాయుడును నిజంగా చాలా బాధపెట్టి ఉంటుంది. భవిష్యత్‌లో అంతా మంచి జరగాలని ఆశిస్తున్నా    
–సెహ్వాగ్‌ 

బాగా ఆడిన తర్వాత కూడా వరల్డ్‌ కప్‌ జట్టులో స్థానం లభించకపోతే రాయుడు ఎంత బాధపడ్డాడో, ఆవేదన చెందాడో అర్థం చేసుకోగలను. జీవితంలోని రెండో ఇన్నింగ్స్‌ సంతోషంగా, శాంతితో సాగాలని కోరుకుంటున్నా.
–వీవీఎస్‌ లక్ష్మణ్‌  

>
మరిన్ని వార్తలు