సరైనోడు...

30 Oct, 2018 23:45 IST|Sakshi

ఒకరా...? ఇద్దరా..? సురేశ్‌ రైనా, మనీశ్‌పాండే, లోకేష్‌ రాహుల్, దినేశ్‌ కార్తీక్, కేదార్‌ జాదవ్‌! ఆఖరికి ఓ దశలో మహేంద్ర సింగ్‌ ధోని...! డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌ దూరమైనప్పటి నుంచి భారత వన్డే జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ‘నాలుగో స్థానం’ నిన్నమొన్న టి వరకు కుర్చీలాటను తలపించింది. కొత్త, పాత లేకుండా ఆ స్థానంలో దిగే ఆటగాడు ఒక సిరీస్‌లో రాణిస్తే మరో సిరీస్‌లో పూర్తిగా నిరాశపర్చేవాడు. ఇది చివరకు జట్టునే అస్థిరపర్చేంత వరకు వచ్చింది. టాప్‌–3లో ధవన్, రోహిత్, కోహ్లి అమోఘంగా ఆడుతుండటంతో అదృష్టవశాత్తూ ఆ పరిస్థితి తలెత్తలేదు. కానీ, ఇలా ఎంత కాలం? ప్రతిష్ఠాత్మ క ప్రపంచ కప్‌ అతి సమీపంలో ఉండగా కీలక స్థానంలో సమర్థుడైన బ్యాట్స్‌మన్‌ లేకుంటే ఎలా? ఈ ప్రశ్నలు, సందేహాలకు ఇదిగో తాను న్నానంటున్నాడు తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు. అటు ధోని భరోసాతో పునరుజ్జీవం పొంది... ఇటు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నమ్మకంతో నంబర్‌ 4లో నిలదొక్కుకున్న రాయుడు టీమ్‌ మే నేజ్‌మెంట్‌కు ఇప్పుడో పెద్ద తలనొప్పిని తప్పిం చాడు. ఇదే ఊపు ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌లోనూ కొనసాగిస్తే 2019 ప్రపంచ కప్‌ బెర్తు ఖాయం.

ఆ ఇన్నింగ్సే నిదర్శనం..
టాప్‌ 3 బ్యాట్స్‌మెన్‌ అందించిన జోరును కొనసాగించడం, ఒకవేళ వారు విఫలమైతే ఇన్నింగ్‌ను నిర్మిస్తూ ఆఖర్లో హిట్టింగ్‌తో సాధ్యమైనంతగా జట్టు స్కోరు పెంచడం... నంబర్‌ 4 బ్యాట్స్‌మన్‌ బాధ్యతలు. నాలుగో వన్డేలో దీనినే చేసి చూపాడు రాయుడు. రోహిత్‌కు స్ట్రైక్‌ రొటేషన్‌ చేస్తూ తొలుత సంయమనం చూపిన అంబటి కుదురుకున్నాక చెలరేగాడు. 29వ ఓవర్‌ తర్వాత తనదైన శైలిలో ఎదురుదాడికి దిగాడు. చురుకైన కదలికలతో స్పిన్నర్ల లయను దెబ్బతీశాడు. పేసర్ల స్లో బంతులను ఫ్రంట్‌ ఫుట్, బ్యాక్‌ ఫుట్‌పై సిక్స్‌లుగా పంపిన తీరైతే ముచ్చటగొలిపింది. ఇదంతా అచ్చమైన వన్డే ఇన్నింగ్స్‌కు నిదర్శనంలా సాగింది. దీనికి ముందు విశాఖ వన్డేలో సైతం ఇలాంటి ఇన్నింగ్స్‌తోనే కోహ్లికి అండగా నిలిచాడు. ఈ రెండింటికీ ప్రత్యక్ష సాక్షులుగా నిలిచినందుకేనేమో రాయుడి ఆటపై కోహ్లి, రోహిత్‌ ప్రశంసలు కురిపించారు. నాలుగో స్థానాన్ని ఇక అతడికే రాసిచ్చినట్లుగా మాట్లాడారు.

ఇప్పుడు అతడొక్కడే! 
రాహుల్‌ ఓపెనింగ్‌కే పనికొచ్చేట్లున్నాడు, దినేశ్‌కార్తీక్‌ విశ్వాసం చూరగొనలేకపోయాడు, మనీశ్‌ పాండే ఫామ్‌ గాలిలో దీపం, రైనా సోదిలోనే లేడు. ఈ నేపథ్యంలో మిగిలింది రాయుడే. ఇలా అందివచ్చిన అవకాశాన్ని అతడు కూడా రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఒకట్రెండు వైఫల్యాలు ఎదురైనా స్థానానికి ఢోకా లేనంతగా ఆకట్టుకున్నాడు. సరైన సమయంలో, సరైన స్కోర్లతో తనపై నమ్మకాన్ని పెంచాడు.

దానినీ అందుకుంటే...
రాయుడి ప్రతిభ, సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలు లేకున్నా ఇంతకాలం కాలం అతడికి కలిసిరాలేదు. జట్టులోకి వచ్చి పోతుండటం, ఒకటీ అరా తప్ప చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు లేకపోవడంతో టీమిండియా పూర్తి స్థాయి సభ్యుడిగా పరిగణించలేని పరిస్థితి. ఇప్పుడు జట్టులో నంబర్‌ 4గా కీలక ఆటగాడయ్యాడు. సరిగ్గా చెప్పాలంటే ప్రస్తుతం రాయుడి టైమ్‌ నడుస్తోంది. ఇక చేయాల్సిందల్లా తనదైన ఇన్నింగ్స్‌లతో భారత్‌కు విజయాలు అందించడం.     

మరిన్ని వార్తలు