అంబటి రాయుడుపై వేటు

31 Jan, 2018 14:02 IST|Sakshi
అంబటి రాయడు

ముంబై: భారత క్రికెటర్‌, హైదరాబాద్‌ రంజీ కెప్టెన్‌ అంబటి రాయుడుపై వేటు పడింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు అంబటిపై బీసీసీఐ రెండు మ్యాచుల నిషేధం విధించింది. సయ్యద్‌​ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కర్టాటకతో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా అంబటి నిబంధనలు పాటించక పోవడంతో ఈ చర్యలు తీసుకుంది. ఈ అంశంపై బీసీసీఐ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 'రాయుడు నిబంధనలు ఉల్లంఘించినట్టు అంగీకరించాడు. అదే విధంగా రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని అతను అమోదించాడు' అని తెలిపింది. బీసీసీఐ నిర్ణయంతో రానున్న విజయ్‌ హజారే ట్రోఫిలో మొదటి రెండు మ్యాచ్‌లకు అంబటి దూరం కానున్నాడు.

కాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో భాగంగా జనవరి 11న కర్ణాటకతో హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కర్ణాటక బ్యాటింగ్‌లో.. హైదరాబాద్ ఫీల్డర్ మెహదీ హసన్ బాలును ఆపే ప్రయత్నంలో పొరపాటున బౌండరీ లైన్ తాకాడు. అయితే అది చూడని అంపైర్లు అవి రెండు రన్స్ గా డిక్లేర్ చేశారు. ఆ స్కోరుతో కలుపుకుని కర్ణాటక 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది.

అయితే ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్‌, ఈ విషయాన్ని థర్డ్ అంపైర్‌కు తెలపగా.. ఆయన మరో రెండు పరుగులు అదనంగా ఇచ్చారు. దీంతో కర్ణాటక 205 పరుగులు చేసినట్టు అయింది. ఛేజింగ్ లో హైదరాబాద్ 203 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్  టై అయినా, ముందు కలిపిన రెండు పరుగులతో బెంగళూరు టీమ్ గెలిచిందని అంపైర్లు ప్రకటించారు. దీంతో అంబటి రాయుడు అంపైర్లపై ఫైర్‌ అయ్యాడు. కనీసం సూపర్ ఓవర్ అయినా నిర్వహించాలని అంబటి కోరినా.. అందుకు అంపైర్లు నిరాకరించారు. దీనికి నిరసనగా, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా హైదరాబాద్ ఆటగాళ్లు మైదానంలోనే ఉండిపోయారు. దీంతో, ఆ తర్వాత జరగాల్సిన ఆంధ్ర- కేరళ మ్యాచ్ ఆలస్యంగా మొదలై, 13 ఓవర్ల మ్యాచ్ గా ముగిసింది. ఈ విషయాన్ని అంపైర్లు బీసీసీఐకు పంపించగా.. రాయుడి చర్యలను బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది.

మరిన్ని వార్తలు