డియర్‌ బీసీసీఐ.. రాయుడిని ఎందుకు తీసుకోలేదు!

27 Apr, 2019 08:54 IST|Sakshi
కీపర్‌గా రాయుడు

సోషల్‌ మీడియాలో అభిమానుల ప్రశ్న

చెన్నై : హైదరాబాద్‌ క్రికెటర్‌ అంబటి రాయుడిని తుది వరకు ఊరించిన ప్రపంచకప్‌ బెర్త్‌.. అసలు ప్రణాళికలోనే లేని ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్‌కు దక్కింది. రాయుడు కంటే విజయ్‌ శంకరే (3 డైమెన్షన్స్‌‌) మూడు రకాలుగా ఉపయోగపడతాడన్న చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణపై రాయుడు సెటైరిక్‌గా స్పందిస్తూ ప్రపంచకప్‌ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్‌ ఇచ్చానని ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీసీసీఐ స్పందించడం.. మాజీ క్రికెటర్లు రాయుడుకు అండగా నిలవడంతో 3Dఅనే పదం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇక ​తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాయుడు.. ధోని గైర్హాజరితో కీపర్‌గా కొత్త అవతారమెత్తాడు. దీంతో అభిమానులు బీసీసీఐని, ఎమ్మెస్కే ప్రసాద్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘డియర్‌ బీసీసీఐ.. రాయుడిని ఎందుకు ఎంపిక చేయలేదు. ఐసీసీ మావాడి బౌలింగ్‌ను నిషేదించింది లేకుంటే మావోడు 4D(బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, కీపింగ్‌, బౌలింగ్‌) ఆటగాడు.’  అని ఒకరు.. ‘ఓ ఎమ్మెస్కే ప్రసాద్‌.. రాయుడు కూడా 3D ఆటగాడే ఏమంటావ్‌?’ అని మరొకరు.. ‘బీసీసీఐ 4D ఆటగాడిని దూరం చేసుకుంది’ అని ఇంకొకరు కామెంట్‌ చేస్తున్నారు. ఇక మాజీ క్రికెటర్‌, ప్రస్తుత కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం రాయుడి కీపింగ్‌పై ట్వీట్‌ చేశారు.

‘ధోని గైర్హాజరితో కీపింగ్‌ బాధ్యతలు చేపట్టిన రాయుడు.. తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ సీజన్‌ ఐపీఎల్‌లో రాయుడు పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఒకే ఒక హాఫ్‌ సెంచరీ నమోదు చేయగా.. 4 మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. 55 అంతర్జాతీయ వన్డేలు ఆడిన రాయుడు 3 సెంచరీలు,10 అర్ధసెంచరీలతో 1694 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌ బెర్త్‌ కోసం గత రెండేళ్లుగా రాయుడు తీవ్ర కసరత్తులు చేశాడు. కానీ అందివచ్చిన అవకాశం ఆఖరికి విజయ్‌శంకర్‌ రూపంలో కొట్టుకుపోయింది.

మరిన్ని వార్తలు