ఇది నాకేం కొత్తకాదు: రాయుడు

23 Oct, 2018 19:06 IST|Sakshi
రాయుడు

విశాఖపట్టణం: మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం తనకేం కొత్త కాదని టీమిండియా బ్యాట్స్‌మన్‌, హైదరాబాదీ స్టార్‌ ఆటగాడు అంబటి రాయుడు తెలిపారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అనంతరం బ్యాటింగ్‌కు దిగడంపై తనకెలాంటి ఒత్తిడిలేదని స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డే సందర్భంగా రాయుడు మాట్లాడుతూ.. ‘నిజాయితీగా చెప్పాలంటే నేను ప్రస్తుతం ఈ సిరీస్‌పైనే దృష్టి పెట్టాను. అనంతరం జరిగే పరిణామలపై ఆలోచించడం లేదు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం నాకు కొత్త కాదు. చాలా రోజులు నుంచి ఆ స్థానంలో ఆడుతున్నాను. నేను కేవలం నా ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టి సాధించాను. యోయో టెస్ట్‌ గురించి కూడా అంతగా ఆలోచించలేదు. ఐపీఎల్‌ నాకు మంచి అవకాశం ఇచ్చింది. నేనేంటో నిరూపించుకునేలా చేసింది. భారత జట్టులో మిడిలార్డర్‌లో ఆడటం ఛాలెంజ్‌తో కూడుకున్నది. గువాహటి మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌ అద్భుతంగా ఆడారు.’ అని రాయుడు చెప్పుకొచ్చాడు. 

2001-02లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడటం ప్రారంభించిన ఈ హైదరాబాదీ ఆటగాడు.. 28 ఏళ్ల వయసులో 2013తో జింబాంబ్వేపై తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. ఐపీఎల్‌ ద్వారానే గుర్తింపు పొందిన రాయుడు ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికైనప్పటికీ యోయో విఫలమవడంతో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా గతకొంత కాలంగా భారత జట్టు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మూడు, నాలుగు స్థానాలపై దృష్టిపెట్టిన టీమ్‌మేనేజ్‌మెంట్ దానికి రాయుడే సరైన వాడని భావించి అవకాశం కల్పించింది. ఈ సిరీస్‌లో రాయుడు రాణిస్తే ప్రపంచకప్‌ వరకు జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఇక విండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. బుధవారం వైజాగ్‌ వేదికగా రెండో వన్డే జరగనుంది. 

మరిన్ని వార్తలు