మళ్లీ రాయుడొచ్చాడు 

2 Sep, 2018 02:03 IST|Sakshi

ఆసియా కప్‌ భారత జట్టులో అంబటి రాయుడు

కోహ్లికి విశ్రాంతి, కెప్టెన్‌గా రోహిత్‌ 

ఖలీల్‌ అహ్మద్‌కు తొలిసారి చోటు 

ముంబై: ఐపీఎల్‌లో అదరగొట్టి టీమిండియా తలుపుతట్టిన హైదరాబాద్‌ ఆటగాడు అంబటి రాయుడు ఇంగ్లండ్‌ పర్యటనకే జట్టులోకి వచ్చాడు. కానీ ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి యో–యో టెస్ట్‌ రూపంలో దూరమైంది. యో–యో టెస్టులో విఫలమవడంతో అతనికి ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లిన జట్టులో చోటు దక్కలేదు. ఇప్పుడు తాజాగా అతను యో–యో టెస్టులో విజయవంతం కావడంతో... ఆసియా కప్‌ కోసం పిలుపొచ్చింది. ఈ నెల 15 నుంచి యూఏఈ వేదికగా జరుగనున్న ఆసియా కప్‌ కోసం బీసీసీఐ శనివారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. మూడు ఫార్మాట్లలో అలుపులేకుండా ఆడుతున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతి ఇచ్చారు. అతని స్థానంలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించింది.

శిఖర్‌ ధావన్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్, పేసర్‌ భువనేశ్వర్‌ తిరిగి జట్టులోకి రాగా... ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఉన్న రైనా, శ్రేయస్‌ అయ్యర్, సిద్ధార్థ్‌ కౌల్, ఉమేశ్‌ యాదవ్‌లకు చోటు దక్కలేదు. మనీశ్‌ పాండే, లోకేశ్‌ రాహుల్‌లతో పాటు మాజీ సారథి ధోనికి బ్యాకప్‌గా దినేశ్‌ కార్తీక్‌ ఎంపికయ్యాడు. రాజస్తాన్‌కు చెందిన 20 ఏళ్ల మీడియం పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఖలీల్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 
జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్‌ (వైస్‌ కెప్టెన్‌), రాహుల్, ధోని, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్, రాయుడు, పాండ్యా, కార్తీక్, చహల్, కుల్దీప్, అక్షర్‌ పటేల్, బుమ్రా, భువనేశ్వర్, శార్దుల్, ఖలీల్‌.    

>
మరిన్ని వార్తలు