అలాంటి వారికి రాయుడు ఆదర్శం

26 Jul, 2013 05:18 IST|Sakshi
అలాంటి వారికి రాయుడు ఆదర్శం

న్యూఢిల్లీ: జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని పరితపిస్తున్న యువ ఆటగాళ్లకు అంబటి తిరుపతి రాయుడు ఆదర్శంగా నిలుస్తాడని భారత జట్టు మాజీ కెప్టెన్ అజయ్ జడేజా అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశను వదులుకోవద్దని అతడు చాటిచెప్పాడని కొనియాడాడు. ‘నేను భారత్‌కు ఆడినప్పుడు రాయుడు ఫస్ట్ క్లాస్ కెరీర్ ఆరంభమైంది. పదేళ్ల నుంచి నేనా ఆటగాడిని చూస్తున్నాను. చివరికి ఇన్నాళ్లకు అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం చేయగలిగాడు.

ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆశను వదులుకోరాదనే పాఠం చెబుతుంది. రాయుడుకు అపార ప్రతిభ ఉన్నా భారత జట్టుకు ఆడగలడని చాలా మంది భావించి ఉండకపోవచ్చు. ఫస్ట్ క్లాస్‌లో అపార అనుభవంతో పాటు మంచి టెక్నిక్ ఉండడంతో ఈసారి అతడికి చోటివ్వక తప్పలేదు’ అని జడేజా అన్నాడు. దేశవాళీల్లో మంచి ఆటతీరును చూపిన పుజారా కూడా  వన్డేల్లో అరంగేట్రం చేస్తాడని ఆకాంక్షించాడు.
 
 

మరిన్ని వార్తలు