రాయుడే సరైనోడు! 

21 Oct, 2018 00:48 IST|Sakshi

 నాలుగో స్థానంపై కోహ్లి వ్యాఖ్య   

గువాహటి: భారత క్రికెట్‌ జట్టులో ‘నాలుగో స్థానం’లో రెగ్యులర్‌గా ఆడగల బ్యాట్స్‌మన్‌ కోసం సుదీర్ఘ కాలంగా సందిగ్ధత కొనసాగుతోంది. ముఖ్యంగా 2015 వరల్డ్‌ కప్‌ ముగిసిన తర్వాతి నుంచి అనేక మందితో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రయోగాలు చేసింది. కానీ ఏ ఒక్కరు కూడా గట్టిగా నిలబడి తమ స్థానాన్ని ఖాయం చేసుకోలేకపోయారు. మరో వరల్డ్‌ కప్‌కు చేరువవుతున్న నేపథ్యంలో కోహ్లి చేసిన ఆసక్తికర వ్యాఖ్య దీనిపై కొంత వరకు స్పష్టతనిచ్చింది. ఈ విషయంలో తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడుకు అతను మద్దతు పలికాడు. కోహ్లి మాటలను బట్టి చూస్తే నాలుగో స్థానంలో రహానే, మనీశ్‌ పాండే, కేఎల్‌ రాహుల్, కేదార్‌ జాదవ్, దినేశ్‌ కార్తీక్, ధోనిలకంటే రాయుడే సరైన ఆటగాడిగా విరాట్‌ గుర్తించినట్లు కనిపిస్తోంది. ‘చాలా కాలంగా ఒక్క నాలుగో స్థానంలో ఎవరిని ఆడించాలనే దానిపైనే మేం ప్రయత్నాలు కొనసాగించాం. దురదృష్టవశాత్తూ ఎవరూ మాకు కావాల్సిన విధంగా తమ చోటు ఖాయం చేసుకోలేకపోయారు.

అయితే ఆసియా కప్‌లో రాయుడు ఆటను చూసిన తర్వాత నాలుగో స్థానం సమస్యను తీర్చేందుకు రాయుడుకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నాం. జట్టు మేనేజ్‌మెంట్‌ అదే భావనలో ఉంది. నేను కూడా అతని ఆట చూశాను. అతను మిడిలార్డర్‌కు సరిగ్గా సరిపోతాడు. ఆ స్థానంలో అవకాశాలు  సరిగ్గా ఉపయోగించుకోగలడని మా నమ్మకం. అనుభవజ్ఞుడు కావడంతో పాటు తన రాష్ట్ర జట్టు తరఫున, ఐపీఎల్‌లో కూడా అనేక మ్యాచ్‌లు గెలిపించాడు. భారత్‌ తరఫున కూడా రాయుడు రికార్డు బాగుంది. దీని వల్ల మా మిడిలార్డర్‌ కూడా దాదాపుగా స్థిరపడినట్లే’ అని కోహ్లి స్పష్టతనిచ్చాడు. జహీర్, ఆశిష్‌ నెహ్రాల తర్వాత ఖలీల్‌ అహ్మద్‌ రూపంలో తమకు నాణ్యమైన లెఫ్టార్మ్‌ పేసర్‌ లభించాడని, అలాంటి ఆటగాడు జట్టులో ఉండటం వల్ల వైవిధ్యం పెరుగుతుందని విరాట్‌ కోహ్లి ప్రశంసించాడు. మరో వైపు ధోని 5, 6, 7 స్థానాల్లో ఆడగలడా అంటూ వచ్చిన విమర్శలను తిప్పికొట్టిన కోహ్లి...ఎలాంటి వివాదం లేని చోట వాటిని కావాలని సృష్టించే ప్రయత్నం చేయవద్దని సూచించాడు.   

>
మరిన్ని వార్తలు