ఆ కల ఇంకా తాజాగానే ఉంది: అం‍బటి రాయుడు

5 Jul, 2018 11:47 IST|Sakshi

బెంగళూరు: ఐపీఎల్ 2018 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులోకి పునరాగమనం చేసిన అంబటి రాయుడు.. యో-యో టెస్టులో ఫెయిల్‌ కావడంతో జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన రాయుడు 16 మ్యాచ్‌లకు గాను మొత్తం 602 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. ఈ ప్రదర్శనని పరిగణలోకి తీసుకున్న భారత సెలక్టర్లు ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానంలో కల్పించారు.

కానీ.. ఇంగ్లండ్ పర్యటన ఆరంభానికి ముందు బెంగళూరులో నిర్వహించిన యో-యో ఫిట్‌నెస్ టెస్టులో రాయుడు ఫెయిలయ్యాడు. దీంతో జట్టు నుంచి అతడ్ని తప్పించి సురేశ్ రైనాకి అవకాశం కల్పించారు. యో-యో టెస్టు ఫెయిలైన తర్వాత మీడియాకి దూరంగా ఉన్న అంబటి రాయుడు తాజాగా మళ్లీ మీడియా ముందుకొచ్చాడు. ‘భారత జట్టుకు మళ్లీ ఆడాలనే ఆశని నేను వదులుకోలేదు. ఆ కల ఇంకా తాజాగానే ఉంది. ప్రస్తుతం నా ఆటకి మెరుగులు దిద్దుకుంటున్నా. త్వరలోనే మళ్లీ యో-యో ఫిట్‌నెస్ టెస్టుకి హాజరవుతా. కచ్చితంగా పాసవుతాననే నమ్మకం ఉంది. టీమిండియాకు ఆడాలనే నా లక్ష్యం కోసం కష్టపడుతూనే ఉన్నా. అదే నన్ను నడిపిస్తుంది’ అని రాయుడు పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు