నా భర్త నిజాయితీనే ప్రశ్నిస్తారా?

1 Aug, 2019 11:02 IST|Sakshi

కరాచీ:  ఇటీవల టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన పాకిస్తాన్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌పై ఆ దేశ మాజీలు విమర్శనాస్త్రాలు సంధించారు. టెస్టు ఫార్మాట్‌ను వదిలి, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవుతానంటూ ఆమిర్‌ పేర్కొనడం పలువురు దిగ్గజ క్రికెటర్లను విస్మయానికి గురి చేసింది. 27 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి పాక్‌ క్రికెట్‌కు ద్రోహం చేశాడంటూ షోయబ్‌ అక్తర్‌ ఘాటుగా స్పందించాడు. ఇది ఆమిర్‌ తొందరపాటు నిర్ణయమని వసీం అక్రమ్‌ సైతం పేర్కొన్నాడు. ఆమిర్‌ ఇంగ్లండ్‌కు మకాం మార్చనున్నాడని వార్తలు కూడా వ్యాపించాయి.

ఇలా ఆమిర్‌పై వరుస పెట్టి విమర్శలు రావడంతో అతని భార్య నర్గీస్‌ మాలిక్‌ వాటిని తిప్పికొట్టే యత్నం చేశారు. ‘ నా భర్త నిజాయితీనే ప్రశ్నిస్తారా’ అంటూ ఎదురుదాడికి దిగారు. ‘ పాకిస్తాన్‌ క్రికెటర్‌గా ఆమిర్‌ ఎంతో గర్విస్తాడు. అతని నిజాయితీని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఆమిర్‌ టెస్టు రిటైర్మెంట్‌పై ఎవ్వరికీ సమాధానం చెప్పాల్పిన పనిలేదు. ప్రజలంతా ఆమిర్‌కు మద్దతుగా ఉన్నారు. ఇంగ్లండ్‌కు ఆడాల్సిన అవసరం ఆమిర్‌కు లేదు. పాకిస్తాన్‌కు తప్ప మరే దేశానికి ఆమిర్‌ ప్రాతినిథ్యం వహించడు. పాకిస్తాన్‌ తరఫున క్రికెట్‌ ఆడటాన్ని ఆమిర్‌ ఎంతగానో ఆస్వాదిస్తాడు. ఒకవేళ మా కూతురు క్రికెట్‌ ఆడాలనుకుంటే పాక్‌కే ఆడుతుంది కానీ ఇంగ్లండ్‌కు కాదు. ఆమిర్‌ రిటైర్‌ అయ్యింది కేవలం టెస్టు క్రికెట్‌ నుంచే కానీ ఓవరాల్‌ క్రికెట్‌ నుంచి కాదనే విషయం తెలుసుకోవాలి. వన్డేలు, టీ20ల్లో దేశం గర్వించేలా ఆమిర్‌ ఆడతాడు’ అని బ్రిటీష్‌ సంతతికి చెందిన నర్గీస్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు