అమిత్, పూజ  ‘పసిడి’ పంచ్‌

27 Apr, 2019 00:52 IST|Sakshi

భారత బాక్సర్లకు రెండు స్వర్ణాలు

బ్యాంకాక్‌: ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. చివరి రోజు పురుషుల విభాగంలో అమిత్‌ పంఘల్‌ (52 కేజీలు)... మహిళల విభాగంలో పూజా రాణి (81 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. ఫైనల్లో ఓడిన దీపక్‌ సింగ్‌ (49 కేజీలు), కవిందర్‌ (56 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), సిమ్రన్‌జిత్‌ (64 కేజీలు)లకు రజత పతకాలు లభించాయి. సెమీస్‌లో ఓడిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు), సోనియా (57 కేజీలు), మనీషా (54 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), శివ థాపా (60 కేజీలు), ఆశిష్‌ (69 కేజీలు), సతీశ్‌ (ప్లస్‌ 91 కేజీలు)లకు కాంస్యాలు దక్కాయి.  

ఫైనల్లో అమిత్‌ 5–0తో కిమ్‌ ఇంక్యు (కొరియా)పై, పూజా రాణి 4–1తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ వాంగ్‌ లీనా (చైనా)పై గెలుపొందారు. ఇతర ఫైనల్స్‌లో దీపక్‌ 2–3తో నొదిర్జాన్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో... కవిందర్‌ 0–5తో మిరాజిజ్‌బెక్‌ (ఉజ్బెకి స్తాన్‌) చేతిలో... ఆశిష్‌ కుమార్‌ 0–5తో కులాఖ్‌మెత్‌ (కజకిస్తాన్‌) చేతిలో... సిమ్రన్‌జిత్‌ కౌర్‌ 1–4తో డాన్‌ డుయు (చైనా) చేతిలో ఓడిపోయారు.    

>
మరిన్ని వార్తలు