కోహ్లి మరో రికార్డు బద్దలైంది..

3 Jun, 2017 18:54 IST|Sakshi
కోహ్లి మరో రికార్డు బద్దలైంది..

లండన్: వేగంగా ఇరవై ఐదు వన్డే సెంచరీలు చేసిన బ్యాట్స్మన్గా భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నెలకొల్పిన రికార్డు చెరిగిపోయింది. తాజాగా ఆ రికార్డును దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా అధిగమించాడు. గతేడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వేగంగా 25 సెంచరీలు సాధించిన రికార్డను విరాట్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రికార్డును దాదాపు ఏడాది వ్యవధిలో ఆమ్లా బద్ధలు కొట్టాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డేలో ఆమ్లా(103) శతకం సాధించాడు. తద్వారా 25వ వన్డే సెంచరీని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఆ రికార్డును వేగవంతంగా సాధించిన అరుదైన ఘనతను ఆమ్లా సొంతం చేసుకున్నాడు. ఈ ఫీట్ ను సాధించడానికి ఆమ్లాకు 151 ఇన్నింగ్స్ లు అవసరమైతే, కోహ్లి 162 ఇన్నింగ్స్ లో నమోదు చేశాడు.

అంతకుముందు విరాట్ కోహ్లి వన్డేల్లో వేగంగా ఏడువేల పరుగులు చేసిన రికార్డును కూడా ఆమ్లానే సవరించడం ఇక్కడ విశేషం. ఇటీవల ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి వన్డేలో ఆమ్లా ఏడు వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. దాంతో ఆమ్లా 151 ఇన్నింగ్స్లలోనే ఈ మైలురాయిని అందుకొని ఈ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఆ క్రమంలోనే కోహ్లి 161 ఇన్నింగ్స్‌లలోనే నెలకొల్పిన రికార్డు చెరిగిపోయింది.

>
మరిన్ని వార్తలు