ఆమ్లా వికెట్‌తోనే విజయానికి బాటలు

28 Jan, 2018 02:11 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌

వాండరర్స్‌ పిచ్‌ స్పందించిన తీరు చూస్తోంటే 1969లో భారత్‌– ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ఓ మ్యాచ్‌ గుర్తుకొస్తుంది. బిల్‌ లారీ సారథ్యంలోని ఆసీస్‌ ఆసమయంలో భారత్‌లో పర్యటించింది. ఫిరోజ్‌షా కోట్ల వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో పిచ్‌ ఇలాగే స్పందించడంతో మన స్పిన్నర్లు చెలరేగి కంగారూలను రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ లక్ష్యం 190 పరుగులే. అయినప్పటికీ ఆసీస్‌ చేయితిరిగిన స్పిన్నర్లు ఆష్లే మల్లెట్, జాన్‌ గ్లెసన్‌... పేసర్లు డ్రాహం మెకంజి, అలన్‌ కొన్లీలను ఎదుర్కొని మ్యాచ్‌ను గెలవడం అంటే అద్భుతం చేయడమే అని భావించారు. కానీ తర్వాత పిచ్‌ సాధారణంగా మారిపోవడంతో భారత్‌ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అవలీలగా విజయాన్నందుకుంది. భారత స్పిన్నర్లు సులువుగా రాణించిన అదే పిచ్‌పై, ఆష్లే మల్లెట్‌ బంతిని తిప్పడానికి అష్టకష్టాలు పడ్డాడు.   

వాండరర్స్‌లో నాలుగోరోజు కూడా ఇదే జరిగింది. మూడో రోజు ప్రమాదకరంగా కనిపించిన పిచ్‌ నాలుగో రోజు అనూహ్యంగా తొలి సెషన్‌లో బ్యాటింగ్‌కు సహకరించింది. లంచ్‌కు ముందు వరకు కూడా వికెట్‌ తీయడం భారత బౌలర్లకు గగనమైంది. మన బ్యాట్స్‌మెన్‌ బంతి బంతికీ గాయపడ్డ పిచ్‌పై ఆమ్లా, ఎల్గర్‌ నింపాదిగా బ్యాటింగ్‌ చేశారు. వీరు పరుగులు చేస్తుంటే మన బౌలర్లు చేష్టలుడిగిపోయారు. ఇక్కడే ఆమ్లా గొప్పతనం కనిపిస్తుంది. పరుగే గగనంగా మారిన పిచ్‌పై అతను రెండు ఇన్నింగ్స్‌లలో రెండు అర్ధసెంచరీలు చేశాడు. ఎల్గర్‌ కూడా మరోసారి తన విలువేంటో చూపించాడు. ఆమ్లాకు చక్కగా సహకరిస్తూ విలువైన పరుగుల్ని జోడించాడు. టీ విరామానికి ముందు డివిలియర్స్, ఆమ్లాలను అవుట్‌ చేయడంతోనే భారత విజయానికి బాటలు పడ్డాయి.    

మరిన్ని వార్తలు