ఒక శకం ముగిసింది...

14 Nov, 2013 03:23 IST|Sakshi
ఒక శకం ముగిసింది...

ఫ్యాబ్యులస్ 4 ... భారత టెస్టు క్రికెట్ దశ, దిశను మార్చిన నలుగురు దిగ్గజ ఆటగాళ్లు. గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్‌ల రిటైర్మెంట్‌తో రంగంలో మిగిలిన ఏకైక ఆటగాడు సచిన్. ఇప్పుడు అతను కూడా కెరీర్‌కు గుడ్‌బై చెప్పడంతో భారత టెస్టు చరిత్రలో ఒక శకం ముగుస్తోంది. ఎన్నో అపూర్వ, అనూహ్య, అద్భుత విజయాలు అందించిన ఈ నలుగురు తమదైన ముద్ర వేసి నిష్ర్కమించారు. వ్యక్తిగత ప్రదర్శన ప్రకారం చూస్తే వీరందరి ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. అయితే ఈ దిగ్గజాలు తమ వ్యక్తిగత ఘనతల కంటే చేసింది చాలా ఎక్కువ.
 
 నలుగురిలో అందరికంటే ముందుగా 1989లో సచిన్ అరంగేట్రం జరిగింది. మరో ఏడేళ్ల తర్వాత గంగూలీ, ద్రవిడ్ ఒకే టెస్టుతో దూసుకొచ్చారు. ఈ ఇద్దరి నాలుగో టెస్టు, హైదరాబాదీ లక్ష్మణ్‌కు తొలి టెస్టు.
 
 ఈ నలుగురు జట్టులోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల పాటు భారత క్రికెట్‌లో పెద్దగా పురోగతి ఏమీ లేదు. విదేశాల్లోనైతే విజయాల మాట దేవుడెరుగు...డ్రాతో గట్టెక్కితే చాలనే పరిస్థితి. అద్భుతాలు అనదగ్గ విజయాలేవీ దక్కలేదు.
 
 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం దేశాన్ని కుదిపేసింది. దీని తర్వాత  నిలిచిన ఈ నలుగురు జట్టుకు మార్గనిర్దేశం చేశారు. కొత్త మిలీనియంలో సాధించే విజయాలకు వేదికను సిద్ధం చేశారు. కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ భారత జట్టుకు దూకుడు నేర్పిస్తే... ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్ ఎన్నో అపురూప ఇన్నింగ్స్ ఆడారు. ఇప్పుడు వస్తున్న విజయాలకు పునాది వేసింది మాత్రం వీళ్లే.
 
 ఈ దిగ్గజాలు జట్టులో ఉండగా 2000 తర్వాత  భారత్ సాధించిన అపూర్వ విజయాలు ఎన్నో... ఇంగ్లండ్‌లో 21 ఏళ్ల తర్వాత తొలి సిరీస్ విజయం.... వెస్టిండీస్‌లో 35 ఏళ్ల తర్వాత...న్యూజిలాండ్‌లో 33 ఏళ్ల తర్వాత...పాకిస్థాన్‌లో తొలిసారి సిరీస్ విజయాలు... దక్షిణాఫ్రికాలో టెస్టు విజయం.... అప్పటి వరకు అజేయంగా కనిపించిన ఆస్ట్రేలియాను మూడుసార్లు సొంతగడ్డపై చిత్తు చేస్తే, వారి గడ్డపై రెండుసార్లు విజయానికి చేరువగా వచ్చాం. 2000 నుంచి 2012 వరకు భారత్ 48 టెస్టులు గెలిస్తే, 27 మ్యాచ్‌ల్లోనే ఓడింది. సొంతగడ్డపై 52 టెస్టుల్లో ఓడింది 7 మ్యాచ్‌లే. 2009 డిసెంబర్‌లో భారత్ తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది.
 
 2008లో ఆసీస్‌తో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో గంగూలీ రిటైర్ అయ్యాడు. 2012లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర వైఫల్యం తర్వాత ద్రవిడ్ గుడ్‌బై చెప్పేశాడు. అనూహ్య పరిస్థితుల్లో లక్ష్మణ్ గత ఏడాదే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు సచిన్ వంతు. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు ఎంత మంది వచ్చినా ఈ దిగ్గజాల స్థానాలను భర్తీ చేయలేరు. ఎందుకంటే వారి విలువను గుర్తించేందుకు కేవలం గణాంకాలు సరిపోవు.
 
 థర్డ్ అంపైర్ అవుటిచ్చిన తొలి అంతర్జాతీయ బ్యాట్స్‌మన్ సచిన్. 1992 డర్బన్ టెస్టు రెండో రోజు జాంటీ రోడ్స్ వేసిన త్రోకు రనౌటయ్యాడు.
 
 19 ఏళ్ల వయసులో కౌంటీ క్రికెట్ ఆడిన తొలి భారతీయ యువ క్రికెటర్‌గా అవతరించాడు.
  మాస్టర్ నటించిన తొలి వాణిజ్య ప్రకటన ‘స్టిక్కింగ్ ప్లాస్టర్’.
 
 బూస్ట్‌తో తొలి వాణిజ్య ఒప్పందం. కపిల్‌తో కలిసి అప్పట్లో నటించిన ప్రకటన అందరినీ ఆకట్టుకుంది.
 
 మహారాష్ట్ర ఫేమస్ స్నాక్స్ అయిన ‘వడా-పావ్’ అంటే మాస్టర్‌కు చాలా ఇష్టం. దాన్ని తినడంలో సహచరులు కాంబ్లీ, అంకోలాలతో పోటీ పడేవాడు.
 
  వాంపైర్ బ్యాట్‌ను అమితంగా ఇష్టపడే సచిన్ టెస్టుల్లో 50వ శతకం చేసేందుకు దాన్నే ఉపయోగించాడు.
 
 సౌరవ్ గంగూలీని సచిన్ ‘బాబు మోషాయ్’ అని పిలిస్తే... దాదా మాస్టర్‌ను ‘చోటా బాబు’ అని పిలిచేవాడు.
 
  నెట్ సెషన్‌లో అవుట్ కాకుండా ఆడిన ఆటగాడికి  కోచ్ రమాకాంత్ అచ్రేకర్ ఒక కాయిన్  ఇచ్చే వారట. సచిన్ 13సార్లు అవుట్ కాకుండా ఆడి కాయిన్స్ గెలుచుకున్నాడు.
 
  టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడటం సచిన్‌కు మహా సరదా. వర్షం విరామంలో దీనితో క్రికెట్ ఆడేవాడు.
 
  కెరీర్ తొలినాళ్లలో ఫాస్ట్ బౌలర్ కావాలన్న మాస్టర్ కలను డెన్నిస్ లిల్లీ తోసిపుచ్చాడు. 1987లో ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.
  1987 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో సచిన్ బాల్‌బాయ్‌గా పని చేశాడు. అప్పుడు అతని వయసు 14 ఏళ్లు
 
 1988 బ్రబౌర్న్‌లో భారత్‌తో జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సచిన్ పాక్ తరఫున సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా పని చేశాడు.

మరిన్ని వార్తలు