ఉంపన్‌: ‘పెద్ద నష్టమేమి జరగలేదు’

24 May, 2020 09:27 IST|Sakshi

కోల్‌కతా: కరోనా వైరస్‌తో దేశమంతా అల్లాడిపోతున్న ఆపత్కాలంలో పులి మీద పుట్రలా ప్రళయ భీకర ఉంపన్‌ తుపాను పశ్చిమబెంగాల్‌ను అతలాకుతలం చేసింది. ఈ తుపాను దాటికి పదుల సంఖ్యలో ప్రాణాలు, వేల ఎకరాల్లో పంట నష్టం, భారీగా ఆస్థి నష్టం జరిగింది. అతి తీవ్ర తుపాను ఉంపన్‌ దాటికి మహానగరం కోల్‌కతా చిగురుటాకులా వణికిపోయింది. అయితే దేశంలోనే ప్రఖ్యాత మైదానంగా పేరుగాంచిన ఈడెన్‌ గార్డెన్స్‌ పరిస్థితిపై క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) అధ్యక్షుడు అవిషేక్‌ దాల్మియా ఈడెన్‌ గార్డెన్స్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. 

‘ఉంపన్‌ తుపాన్‌ ఎలాంటి భీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ భీకర తుపానుతో పిచ్‌, ఔట్‌ ఫీల్డ్‌ పూర్తిగా దెబ్బతినడం మినహా పెద్ద నష్టమేమి జరగలేదు. జరగకూడదనే కోరుకుంటున్నాం. వేగంగా వీచిన గాలులకు కొన్ని చోట్ల అద్దాలు పలిగాయి, కొన్ని బ్లాక్‌లు దెబ్బతిన్నాయి. పరిస్థితి చక్కబడ్డాక ఇంజనీర్‌ వచ్చి ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానాన్ని పూర్తిగా పరిశీలించి మాకు రిపోర్టు అందిస్తారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో ఎలాంటి తుపానుల వచ్చినా తట్టుకొనే విధంగా పలు నిర్మాణాలను చేపట్టాలనుకుంటున్నాం’ అంటూ అవిషేక్‌ దాల్మియా పేర్కొన్నాడు.  

ఉంపన్‌ తుపాను సృష్టించిన ప్రళయ భీభత్సం

చదవండి:
ఉంపన్‌ విపత్తు; కేంద్రంపై బెంగాల్‌ ఆగ్రహం
‘ఇక్కడ తప్పెవరిదో మీరే చెప్పండి’

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు