కరాటేలో అక్కాచెల్లెళ్ల ప్రపంచ రికార్డు

31 May, 2019 14:13 IST|Sakshi

అమృత, సంతోషిణి రెడ్డిల ఘనత

కాచిగూడ: సాహసోపేతమైన క్రీడ కరాటేలో తెలంగాణకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అబ్బురపరుస్తున్నారు. విస్మయానికి గురిచేసే సాహసకృత్యాలతో ఔరా అనిపిస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలను అలవోకగా చేస్తూ రికార్డులను ఒడిసిపడుతున్నారు. వీరిద్దరూ చూపించిన తెగువకు వరల్డ్‌ రికార్డ్స్‌ వీరి చెంత చేరాయి. నగరానికి చెందిన అక్కాచెల్లెళ్లు అమృత రెడ్డి, సంతోషిణిల రికార్డు కరాటే ప్రదర్శనకు బర్కత్‌పురలోని కరాటే అకాడమీ వేదికైంది.

రాష్ట్రావతరణ థీమ్‌తో...

కరాటేలో అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్న ఈ అక్కాచెల్లెళ్లు వరల్డ్‌ రికార్డు సృష్టించేందుకు తెలంగాణ రాష్ట్రావతరణ థీమ్‌ను తీసుకున్నారు. రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1827 రోజులకుగానూ 1827 మేకులను ఉపయోగించారు. 60 నెలలకు సూచకంగా 60 షాబాదు బండలను వినియోగించారు. 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విన్యాస ప్రదర్శనకు కేవలం 5 నిమిషాల సమయాన్ని వ్యవధిగా పెట్టుకున్నారు. ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, విశ్వం వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతిని«ధుల సమక్షంలో వీరిద్దరూ గురువారం 1827 మేకులపై పడుకొని పొట్టపై 60 షాబాదు బండలను పగుల గొట్టించుకున్నారు. ఈ విన్యాసాన్ని కేవలం 3 నిమిషాల 10 సెకన్లలోనే పూర్తి చేసి కరాటేలో వరల్డ్‌ రికార్డు సాధించారు. వీరి తెగువను అభినందించిన ఆయా వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థల ప్రతినిధులు అమృత రెడ్డి, సంతోషిణి రెడ్డిలకు ధ్రువపత్రాలను, పతకాలను అందజేశారు.  

తదుపరి లక్ష్యం లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌

కరాటేలో తదుపరి లక్ష్యం లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించడమేనని ఈ అక్కాచెల్లెళ్లు పేర్కొన్నారు. వీరి ప్రతిభను గుర్తించిన జీవీఆర్‌ కరాటే అకాడమీ డైరెక్టర్‌ డాక్టర్‌ జీఎస్‌ గోపాల్‌ రెడ్డి... అమృత, సంతోషిణిల సాహస విన్యాసాలను లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ పరిశీలన కోసం పంపిస్తామని తెలిపారు. వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇండియా కో ఆర్డినేటర్‌ బింగి నరేందర్‌ గౌడ్, విశ్వం వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి అరుణ్‌ కుమార్, రిటైర్డ్‌ ఐఏఎస్‌ రఫత్‌ ఆలీ, ఏసీపీ శ్రీనివాస్, షర్మిష్టా దేవి, దేవికా రాణి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, అశోక్‌ కుమార్, దేవిరెడ్డి విజితా రెడ్డి, సమీర్, పద్మజ తదితరులు పాల్గొని అమృత, సంతోషిణిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవీఆర్‌ కరాటే అకాడమీ డైరెక్టర్‌ డాక్టర్‌ జీఎస్‌ గోపాల్‌రెడ్డి, బ్లాక్‌బెల్ట్స్‌ వి.నరసింహరావు, కీరం, సుభాష్, సంతోష్, మహేందర్, విప్లవ్, పాండు, స్నిగ్ధ, తుల్జారామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా