అండర్సన్ సెంచరీ: కివీస్ 419/8

24 Oct, 2013 01:19 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు నమోదు చేసింది. కోరి అండర్సన్ (173 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 116) సెంచరీతో చెలరేగడంతో బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 133 ఓవర్లలో 8 వికెట్లకు 419 పరుగులు చేసింది. వాట్లింగ్ (59 బ్యాటింగ్), ఇందర్‌బీర్ సింగ్ సోధి (55 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం మెకల్లమ్ సేన 137 పరుగుల ఆధిక్యంలో ఉంది.
 
 ఓవర్‌నైట్ స్కోరు 107/3 తో మూడో రోజు ఆట కొనసాగించిన కివీస్‌ను బంగ్లా బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ విలియమ్సన్ (62), టేలర్ (53) అర్ధసెంచరీలతో భారీ స్కోరుకు పునాది వేశారు. టేలర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అండర్సన్ ఆతిథ్య బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. విలియమ్సన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 140 పరుగులు జోడించాడు. చివర్లో బ్రేస్‌వెల్ (17), వాగ్నేర్ (8) నిరాశపర్చినా... వాట్లింగ్, సోధి కుదురుగా ఆడారు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 84 పరుగులు జోడించడంతో కివీస్ భారీ స్కోరు ఖాయమైంది. బంగ్లా బౌలర్లలో షకీబ్ 5, అల్ అమిన్, అబ్దుర్ రజాక్, నాసిర్ హుస్సేన్ తలా ఓ వికెట్ తీశారు.
 

మరిన్ని వార్తలు