టైటిల్‌ పోరుకు ఆంధ్రా బ్యాంక్‌

2 Feb, 2019 10:03 IST|Sakshi

హెచ్‌సీఏ వన్డే లీగ్‌ సెమీస్‌లో జై హనుమాన్‌ పరాజయం      

సాక్షి, హైదరాబాద్‌: బ్యాటింగ్, బౌలింగ్‌ రంగాల్లో సమష్టిగా రాణించిన ఆంధ్రా బ్యాంక్‌ జట్టు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎ–డివిజన్‌ వన్డే లీగ్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఈసీఐఎల్‌ గ్రౌండ్‌ వేదికగా శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఆంధ్రా బ్యాంక్‌ 126 పరుగుల తేడాతో జై హనుమాన్‌ జట్టుపై విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్రా బ్యాంక్‌ 45 ఓవర్లలో 9 వికెట్లకు 365 పరుగుల భారీస్కోరు చేసింది. ఆశిష్‌ రెడ్డి (41 బంతుల్లో 70; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), టి. రవితేజ (51 బంతుల్లో 53; 5 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. ఓపెనర్లు నవీన్‌ రెడ్డి (41), రోనాల్డ్‌ రాస్‌ రోడ్రిగ్స్‌ (48) తొలి వికెట్‌కు 78 పరుగుల్ని జోడించి శుభారంభం అందించారు.

వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ పీఎస్‌ చైతన్య రెడ్డి (40 బంతుల్లో 46; 3 ఫోర్లు, 1 సిక్స్‌), అభినవ్‌ కుమార్‌ (14 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎంఏ ఖాదిర్‌ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో రంగనాథ్‌ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం జైహనుమాన్‌ 36.3 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కష్టసాధ్యమైన లక్ష్యఛేదనలో జై హనుమాన్‌ జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు శశిధర్‌ రెడ్డి (49; 7 ఫోర్లు), అనిరుధ్‌ రెడ్డి (57; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 111 పరుగులు జతచేసి జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అయితే కె. సుమంత్‌ (3), విఠల్‌ అనురాగ్‌ (5), ప్రతీక్‌ రెడ్డి (5), సాకేత్‌ సాయిరామ్‌ (6), కార్తికేయ (2) క్రీజులో నిలవలేకపోయారు. మరో ఎండ్‌లో రోహిత్‌ రాయుడు (62 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టు ఆ మాత్రమైన స్కోరు సాధించగలిగింది. సూర్యతేజ (31) పరవాలేదనిపించాడు. ప్రత్యర్థి బౌలర్లలో హితేశ్‌ యాదవ్‌ మూడు, రవితేజ, అమోల్‌ షిండే చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.   

మరిన్ని వార్తలు