ఆంధ్ర ఆశలు ఆవిరి

29 Nov, 2017 00:31 IST|Sakshi

ఒడిశాపై విజయంతో గ్రూప్‌ ‘సి’ నుంచి క్వార్టర్స్‌ చేరిన మధ్యప్రదేశ్‌

ఇండోర్‌: ఆంధ్ర క్రికెట్‌ జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. రంజీ ట్రోఫీలో నిలకడగా రాణించినప్పటికీ ఆ జట్టుకు క్వార్టర్స్‌లో స్థానం దక్కలేదు. ఆంధ్ర జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ చేరాలంటే ఒడిశాతో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ విజయం సాధించకుండా ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. ఆంధ్రను వెనక్కి నెట్టి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాలంటే ఒడిశాపై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ జట్టు అనుకున్న ఫలితం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో ఒడిశాను ఓడించి ఆంధ్ర ఆశలను ఆవిరి చేస్తూ మధ్యప్రదేశ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. మ్యాచ్‌ చివరిరోజు 110 పరుగుల విజయలక్ష్యాన్ని మధ్యప్రదేశ్‌ మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 237/4తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఒడిశా 350 పరుగుల వద్ద ఆలౌటైంది. ఈ విజయంతో మధ్యప్రదేశ్‌ మూడు విజయాలు, రెండు ‘డ్రా’లతో 21 పాయింట్లు సాధించి గ్రూప్‌ ‘సి’ టాపర్‌గా నిలిచింది. 

ముంబై కూడా 21 పాయింట్లు సాధించినా ఎక్కువ విజయాలు సాధించిన మధ్యప్రదేశ్‌కు అగ్రస్థానం దక్కింది. 19 పాయింట్లతో ఆంధ్ర మూడో స్థానంతో సరిపెట్టుకుంది. గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న హైదరాబాద్‌ జట్టు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.  మంగళవారంతో రంజీ ట్రోఫీ సీజన్‌లో అన్ని గ్రూప్‌ల లీగ్‌ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గ్రూప్‌ ‘ఎ’ నుంచి కర్ణాటక (32 పాయింట్లు), ఢిల్లీ (27 పాయింట్లు)... గ్రూప్‌ ‘బి’ నుంచి ఢిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ (34 పాయింట్లు), కేరళ (31 పాయింట్లు)... గ్రూప్‌ ‘సి’ నుంచి మధ్యప్రదేశ్, ముంబై... గ్రూప్‌ ‘డి’ నుంచి విదర్భ (31 పాయింట్లు), బెంగాల్‌ (23 పాయింట్లు) క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించాయి. డిసెంబర్‌ 7 నుంచి మొదలయ్యే క్వార్టర్‌ ఫైనల్స్‌లో ముంబైతో కర్ణాటక; విదర్భతో కేరళ; ఢిల్లీతో మధ్యప్రదేశ్‌; బెంగాల్‌తో గుజరాత్‌ తలపడతాయి.

మరిన్ని వార్తలు