2019లో ఏపీలో జాతీయ క్రీడలు

24 Dec, 2015 02:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: జాతీయ క్రీడలకు మరోసారి తెలుగురాష్ట్రం ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2019లో జరిగే 37వ జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించడానికి జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అంగీకరించింది. గువాహటిలో బుధవారం జరిగిన ఐఓఏ సమావేశంలో ఈ మేరుకు నిర్ణయం తీసుకున్నారని శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.
 
  వాస్తవానికి 2019లో జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్‌లో జరగాల్సి ఉంది. అయితే తాము ప్రస్తుతం ఆ క్రీడలను నిర్వహించే పరిస్థితిలో లేమని ఆ రాష్ట్రం ఇటీవల తెలిపింది. దీంతో తాజాగా ఐఓఏ సమావేశంలో బిడ్‌లను పిలిచారు. ఏపీతో పాటు మేఘాలయా కూడా క్రీడల నిర్వహణకు ఆసక్తి చూపింది. అయితే ఏపీఓఏ ప్రతినిధులు మేఘాలయ అధికారులతో మాట్లాడటంతో వారు వైదొలిగారు.
 
 దీంతో ఏపీకి అవకాశం దక్కింది. ఏపీ ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల చెక్‌ను ఐఓఏకు శాప్ ప్రతినిధులు అందజేశారు. వాస్తవానికి బిడ్ మొత్తం ఐదు కోట్ల రూపాయలు ఐఓఏకు ఇవ్వాలి. మిగిలిన రూ.4.5 కోట్లకు త్వరలో చెక్ పంపుతామని ఏపీ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని ఐఓఏ అధికారులు మన్నించారు. 2017లో గోవాలో జాతీయ క్రీడలు జరగాలి. అయితే పదే పదే వాయిదా పడటం జాతీయ క్రీడల ఆనవాయితీ. కాబట్టి 2019లోనే ఏపీకి ఈ అవకాశం దక్కుతుందా? లేక వాయిదా పడుతుందో చూడాలి. అలాగే జాతీయ క్రీడల నిర్వహణకు కావలసిన స్టేడియాల నిర్మాణం కూడా కొత్త రాష్ట్రంలో చాలా పెద్ద అంశం.
 

మరిన్ని వార్తలు