ఆంధ్ర 211 ఆలౌట్‌

10 Dec, 2019 01:32 IST|Sakshi

అర్ధ సెంచరీతో ఆదుకున్న విహారి

మూలపాడు (విజయవాడ): రంజీ ట్రోఫీ సీజన్‌లో భాగంగా డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. తొలి రోజు 74 ఓవర్లు ఆడి 211 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ హనుమ విహారి (155 బంతుల్లో 83; 12 ఫోర్లు, సిక్స్‌) ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లు ఆడిన విదర్భ వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో ఫజల్‌ (11 బ్యాటింగ్‌), సంజయ్‌ రఘునాథ్‌ (22 బ్యాటింగ్‌) ఉన్నారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టుకు ఓపెనర్లు జ్ఞానేశ్వర్‌ (8), ప్రశాంత్‌ కుమార్‌ (10) శుభారంభం అందించడంలో విఫలం అయ్యారు.

అనంతరం వచ్చిన రికీ భుయ్‌ (9) కూడా పెవిలియన్‌కు చేరడంతో ఆంధ్ర 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యతను కెప్టెన్‌ విహారి, వైస్‌ కెప్టెన్‌ కేఎస్‌ భరత్‌ (53 బంతుల్లో 22; 4 ఫోర్లు) తీసుకున్నారు. వీరు నాలుగో వికెట్‌కు 67 పరుగులు జోడించి జట్టు కుదురుకునేలా చేశారు. అయితే భోజన విరామం అనంతరం వీరు వెంట వెంటనే అవుటవ్వడంతో జట్టు భారీ స్కోరు సాధించడంలో విఫలం అయింది. విదర్భ బౌలర్లలో ఆదిత్య (4/52), రజ్‌నీశ్‌ (3/72), యశ్‌ ఠాకూర్‌ (2/44) రాణించారు. గుజరాత్‌తో ఆరంభమైన మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి రోజు 233 పరుగులకు ఆలౌటైంది. సుమంత్‌ (189 బంతుల్లో 69 నాటౌట్‌; 9 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

జాఫర్‌ అత్యధిక మ్యాచ్‌ల రికార్డు 
ఇదే మ్యాచ్‌లో విదర్భ ఆటగాడు వసీం జాఫర్‌ రంజీల్లో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా 253 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన 41 ఏళ్ల జాఫర్‌ 51.19 సగటుతో 19,147 పరుగులు చేశాడు. అందులో 57 సెంచరీలు, 88 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.

>
మరిన్ని వార్తలు