ఆంధ్ర సెమీస్‌ ఆశలు ఆవిరి! 

23 Feb, 2020 03:06 IST|Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో 136 ఆలౌట్‌

రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 93/2  

సాక్షి, ఒంగోలు: రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీలో తొలిసారి సెమీస్‌ చేరాలన్న ఆంధ్ర జట్టు ఆశలు దాదాపు ఆవిరి అయ్యాయి. ఇక్కడి సీఎస్‌ఆర్‌ శర్మ కాలేజి మైదానంలో సౌరాష్ట్రతో జరగుతోన్న క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ మూడో రోజు ఆటలో ఆంధ్ర నిరాశాజనక బ్యాటింగ్‌తో 78.2 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. దాంతో ప్రత్యర్థి జట్టుకు 283 పరుగుల భారీ ఆధిక్యాన్ని సమర్పించుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ను ఆంధ్ర ‘డ్రా’ చేసుకున్నా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కోల్పోవడంతో సెమీస్‌ వెళ్లే అవకాశం ఉండదు. ఓవర్‌నైట్‌ స్కోరు 40/2తో శనివారం ఆట కొనసాగించిన ఆంధ్ర ఏ దశలోనూ కుదురుగా ఆడుతున్నట్లు కనిపించలేదు.

ఓపెనర్‌ జ్ఞానేశ్వర్‌ (43; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. గాయం కారణంగా యెర్రా పృథ్వీరాజ్‌ బ్యాటింగ్‌కు దిగలేదు. ఆంధ్ర తమ చివరి ఏడు వికెట్లను 43 పరుగుల తేడాతో కోల్పోయింది. జైదేవ్‌ ఉనాద్కట్‌ (4/42), ధర్మేంద్ర సింగ్‌ జడేజా (3/27) ఆకట్టుకున్నారు. ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా సౌరాష్ట్ర బ్యాటింగ్‌కే మొగ్గు చూపింది. ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లలో 2 వికెట్లకు 93 పరుగులు చేసింది. ఫలితంగా 376 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం అవి బరోట్‌ (44 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), విశ్వరాజ్‌ జడేజా (35 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.

ఇతర క్వార్టర్స్‌ మ్యాచ్‌ల సంక్షిప్త స్కోర్లు  
►బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌: 332 ఆలౌట్‌; ఒడిశా తొలి ఇన్నింగ్స్‌: 250 ఆలౌట్‌; బెంగాల్‌ రెండో ఇన్నింగ్స్‌: 79/2 (45 ఓవర్లలో). 
►గుజరాత్‌ తొలి ఇన్నింగ్స్‌: 602/8 డిక్లేర్డ్‌; గోవా తొలి ఇన్నింగ్స్‌: 173 ఆలౌట్‌; గుజరాత్‌ రెండో ఇన్నింగ్స్‌: 158/1 (48 ఓవర్లలో). 
►కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌: 206 ఆలౌట్‌; జమ్మూ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌: 88/2 (34 ఓవర్లలో).

మరిన్ని వార్తలు