చివరి వరకు కేకేఆర్‌తోనే: రసెల్‌

4 May, 2020 03:49 IST|Sakshi

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఆండ్రూ రసెల్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై తన ఇష్టాన్ని చాటుకున్నాడు. మిగతా లీగ్‌లతో పోలిస్తే ఐపీఎల్‌ ఆడే సందర్భంలోనే తనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో చివరివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టుకే ప్రాతినిధ్యం వహించడాన్ని ఆస్వాదిస్తానని చెప్పాడు. ‘నేను మీ ముందు ఒక్కటి అంగీకరించాలి. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) కన్నా కూడా ఐపీఎల్‌ సమయంలోనే నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ముఖ్యంగా ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆడేటపుడు భావోద్వేగాలు తారాస్థాయికి చేరుకుంటాయి. గత ఆరు సీజన్లుగా కోల్‌కతాకే ప్రాతినిధ్యం వహిస్తున్నా. అక్కడి అభిమానుల ప్రేమ అనిర్వచనీయం. నేను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా... మూడో మ్యాచ్‌కు వారు నన్ను అదే రీతిలో స్వాగతిస్తారు. అందుకే నా చివరి మ్యాచ్‌ వరకు కేకేఆర్‌ జట్టుకే ఆడతా’ అని రసెల్‌ వివరించాడు.

మరిన్ని వార్తలు