నేను ఫాస్ట్‌ బౌలర్‌ను: రసెల్‌

1 Jun, 2019 09:57 IST|Sakshi

నాటింగ్‌హామ్ ‌: ‘ఆండ్రీ రసెల్‌‌’.. భారత క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ ఆసాంతం మారుమోగిన పేరు. రస్సెల్‌ మెరుపులు.. రసెల్‌ విధ్వంసకరం అంటూ అంతా అతని బ్యాటింగ్‌ గురించే చర్చ జరిగింది. భారత్‌లో అతనికి విపరీతమైన అభిమాన గణాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఈ వెస్టిండీస్‌ ఆటగాడి విధ్వంసకరం ఐపీఎల్‌తోనే ఆగిపోలేదు.. మెగా ఈవెంట్‌ ప్రపంచకప్‌లోనూ కొనసాగుతుంది. కానీ ఈసారి మాట్లాడుతోంది మాత్రం అతని బౌలింగ్‌ గురించి! శుక్రవారం పాక్‌తో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో రసెల్‌ బౌలింగ్‌ ఒక అద్భుతం. దాదాపు 146 కిలోమీటర్ల వేగంతో వరుసగా షార్ట్‌ పిచ్‌ బంతులు విసిరి అతను పాక్‌ బ్యాట్స్‌మెన్‌ను ఒక ఆటాడుకున్నాడు. ఎక్కడా వేగం తగ్గకుండా, కచ్చితత్వంతో, నిలకడగా షార్ట్‌ బంతులు వేయడంలో అతని అసాధారణ ప్రతిభ కనిపించింది.

రసెల్‌ వేసిన 18 బంతుల్లో 15 బంతులు షార్ట్‌ పిచ్‌వే కావడం విశేషం! అతని మూడు ఓవర్ల స్పెల్‌ పాక్‌లో భయం పుట్టించింది. రసెల్‌ తొలి ఓవర్లో బౌన్సర్‌ను ఫఖర్‌ జమాన్‌ ఆడలేకపోయాడు. అతని హెల్మెట్‌ గ్రిల్‌కు తగిలి బంతి వికెట్లపై పడింది. రెండో ఓవర్లో షార్ట్‌ బంతులను ఆడలేక బాబర్‌ బెదిరిపోయాడు. మెయిడిన్‌గా ముగిసిన మూడో ఓవర్లో ఎత్తులో వేగంగా దూసుకొచ్చిన బంతిని ఆడలేక సొహైల్‌ వికెట్‌ సమర్పించుకున్నాడు. 3 ఓవర్లలో కేవలం 4 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన రసెల్‌.. ‘నేను మీడియం పేసర్‌ను కాదు.. ఫాస్ట్‌ బౌలర్‌ను’అని గట్టిగా చెబుతూ ప్రత్యర్థులను పరోక్షంగా హెచ్చరించాడు.

మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘చాలా మంది నేను ఓ బిగ్‌హిట్టర్‌నని చెబుతుంటారు. వారందరికీ తెలియనిది ఏమిటంటే నేను ఓ ఫాస్ట్‌ బౌలర్‌ను. అందరూ నన్ను తక్కువ అంచనా వేసారు. నన్నందరూ మీడియం పేసర్‌గా పరిగణిస్తుంటే అసూయ పుట్టేది. నేను బంతి అందుకోవడానికి వచ్చినప్పుడు స్క్రీన్‌పై ‘మీడియం పేసర్‌’ అని కనిపించేది. అప్పుడు నాకు తెగ కోపం వచ్చేది. ఎవడు చెప్పిండ్రా నేను మీడియం పేసర్‌నని గట్టిగా అరవాలనిపించేది.’  అని రసెల్‌ తన ఆవేదనను వెళ్లగక్కాడు. 

ఇక గాయంపై స్పందిస్తూ.. ‘చాలా ఏళ్లుగా మోకాలి గాయంతోనే ఆడుతున్నాను. కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నేను ఫ్రొఫెషనల్‌ క్రికెటర్‌ను కాబట్టి మాములే. గాయం నుంచి ఎలా కోలుకోవాలో నాకు బాగా తెలుసు. మరుసటి మ్యాచ్‌కు ఇంకా ఐదు రోజులున్నట్లుంది. నా గాయం తగ్గడానికి ఈ సమయం సరిపోతుంది. నాకు మంచి ఫిజియో టీమ్‌, మసాజ్‌ టీమ్‌ ఉంది. వారంతా నా గాయం తగ్గడానికి కృషి చేస్తారు.’ అని రసెల్‌ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు