ముర్రే ఖేల్‌ ఖతం

15 Jan, 2019 01:37 IST|Sakshi

తొలి రౌండ్‌లోనే ఓడిన బ్రిటన్‌ స్టార్‌

ఫెడరర్, నాదల్‌ శుభారంభం

మెల్‌బోర్న్‌: ఊహించినట్టే జరిగింది. బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆండీ ముర్రే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ నుంచి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. 22వ సీడ్‌ బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ముర్రే 4–6, 4–6, 7–6 (7/5), 7–6 (7/4), 2–6తో పోరాడి ఓడిపోయాడు. 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 19 ఏస్‌లు సంధించి, 51 అనవసర తప్పిదాలు చేశాడు. గతంలో ఐదుసార్లు ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ముర్రే 2008 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తొలి రౌండ్‌లో ఓడిపోవడం ఇదే ప్రథమం. తుంటి గాయంతో బాధపడుతున్న ముర్రే గతేడాది కేవలం యూఎస్‌ ఓపెన్‌లో మాత్రమే పాల్గొని రెండో రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. ఈ సీజన్‌లో తదుపరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లలో ఆడాలా వద్దా అనే నిర్ణయాన్ని వచ్చే వారం తీసుకుంటానని ముర్రే వ్యాఖ్యానించాడు.

 మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), మాజీ విజేత రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ ఫెడరర్‌ 6–3, 6–4, 6–4తో ఇస్టోమిన్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై... రెండో సీడ్‌ నాదల్‌ 6–4, 6–3, 7–5తో జేమ్స్‌ డక్‌వర్త్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. అయితే తొమ్మిదో సీడ్‌ జాన్‌ ఇస్నెర్‌ (అమెరికా) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. అమెరికాకే చెందిన రీలీ ఒపెల్కా 7–6 (7/4), 7–6 (8/6), 6–7 (4/7), 7–6 (7/5)తో ఇస్నెర్‌ను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్‌లో ఒపెల్కా 40 ఏస్‌లు... ఇస్నెర్‌ 47 ఏస్‌లు సంధించడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా) 6–3, 5–7, 6–2, 6–1తో మనారినో (ఫ్రాన్స్‌)పై, ఆరో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా) 6–2, 6–4, 7–6 (7/3)తో బెర్నాడ్‌ టామిక్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.  

ప్రజ్నేశ్‌ పరాజయం 
భారత నంబర్‌వన్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ తొలి రౌండ్‌ అడ్డంకిని దాటలేకపోయాడు. ప్రపంచ 39వ ర్యాంకర్‌ టియాఫో (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్‌ 6–7 (7/9), 3–6, 3–6తో ఓటమి చవిచూశాడు.  

షరపోవా జోరు... 
మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్‌ షరపోవా (రష్యా), డిఫెండింగ్‌ చాంపియన్‌ కరోలైన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌), రెండో సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ) రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. తొలి రౌండ్‌లో షరపోవా 6–0, 6–0తో క్వాలిఫయర్‌ హారియట్‌ డార్ట్‌ (బ్రిటన్‌)ను చిత్తుగా ఓడించగా... వొజ్నియాకి 6–3, 6–4తో అలీసన్‌ (నెదర్లాండ్స్‌)పై, కెర్బర్‌ 6–2, 6–2తో హెర్కాగ్‌ (స్లొవేనియా)పై గెలిచారు. ఐదో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా), ఎనిమిదో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), తొమ్మిదో సీడ్‌ కికి బెర్‌టెన్స్‌ (నెదర్లాండ్స్‌) కూడా రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. స్లోన్‌ స్టీఫెన్స్‌ 6–4, 6–2తో టౌన్‌సెండ్‌ (అమెరికా)పై, క్విటోవా 6–3, 6–2తో రిబరికోవా (స్లొవేకియా)పై, కికి బెర్‌టెన్స్‌ 6–3, 6–3తో అలీసన్‌ రిస్కీ(అమెరికా)పై నెగ్గారు. 22వ సీడ్‌ ఒస్టాపెంకో (లాత్వియా) 1–6, 6–3, 2–6తో మరియా సకారి (గ్రీస్‌) చేతిలో ఓడిపోయింది.   

మరిన్ని వార్తలు