రెండో రౌండ్‌లోనే ముర్రే ఔట్‌

31 Aug, 2018 01:10 IST|Sakshi

యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌  

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రే ఆట ముగిసింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్‌) 7–5, 2–6, 6–4, 6–4తో ముర్రేను చిత్తు చేశాడు. గాయంనుంచి కోలుకొని గత ఏడాది వింబుల్డన్‌ తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆడుతున్న ముర్రే తన స్థాయికి తగిన ప్రదర్శనను ఇవ్వలేకపోయాడు. మరో వైపు 2016 చాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో అతను 7–6 (5), 4–6, 6–3, 7–5తో యుగో హంబర్ట్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. మహిళల విభాగంలో ఆరు సార్లు చాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్‌ (అమెరికా) అలవోకగా మూడో రౌండ్‌కు చేరుకుంది.

రెండో రౌండ్‌లో ఆమె 6–2, 6–2తో కరీనా వితాఫ్ట్‌ (జర్మనీ)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) 6–4, 7–5తో కామిలా గియార్గీ (ఇటలీ)ని ఓడించి ముందంజ వేసింది. మూడో రౌండ్‌ మ్యాచ్‌లో అక్కాచెల్లెళ్లు వీనస్, సెరెనా ప్రత్యర్థులుగా తలపడనుండటం విశేషం. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) కూడా తర్వాతి రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో స్లోన్‌ 4–6, 7–5, 6–2తో అన్హెలినా కలీనియా (ఉక్రెయిన్‌)పై విజయం సాధించింది.    

మరిన్ని వార్తలు