ముర్రే కథ ముగిసింది

13 Jul, 2017 00:31 IST|Sakshi
ముర్రే కథ ముగిసింది

క్వార్టర్‌ ఫైనల్లో సామ్‌ క్వెరీ చేతిలో పరాజయం
రావ్‌నిచ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి ఫెడరర్‌
గాయంతో జొకోవిచ్‌ నిష్క్రమణ


లండన్‌: డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ ఆండీ ముర్రే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్‌ సామ్‌ క్వెరీ (అమెరికా) 3–6, 6–4, 6–7 (4/7), 6–1, 6–1తో ముర్రేను ఓడించాడు. 42వ ప్రయత్నంలో ఈ అమెరికా అజానుబాహుడు తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. అంతేకాకుండా 2009లో ఆండీ రాడిక్‌ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీస్‌కు చేరిన అమెరికా క్రీడాకారుడిగానూ గుర్తింపు పొందాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా) 3–6, 7–6 (8/6), 7–5, 5–7, 6–1తో 16వ సీడ్‌ గైల్స్‌ ముల్లర్‌ (లక్సెంబర్గ్‌)ను ఓడించాడు.

ఫెడరర్‌ ఫటాఫట్‌...
పురుషుల సింగిల్స్‌ మరో క్వార్టర్‌ ఫైనల్లో ఏడుసార్లు చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) 6–4, 6–2, 7–6 (7/4)తో ఆరో సీడ్‌ రావ్‌నిచ్‌ (కెనడా)ను చిత్తుగా ఓడించాడు. ఈ విజయంతో గతేడాది ఇదే టోర్నీ సెమీస్‌లో రావ్‌నిచ్‌ చేతిలో ఎదురైన ఓటమికి ఫెడరర్‌ బదులు తీర్చుకున్నాడు. ఫెడరర్‌ తన కెరీర్‌లో 42వ సారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం విశేషం. థామస్‌ బెర్డిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌)తో జరిగిన మరో క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ తొలి సెట్‌ను 6–7 (2/7) కోల్పోయి, రెండో సెట్‌లో 0–2తో వెనుకబడిన దశలో గాయం కారణంగా వైదొలిగాడు.

శుక్రవారం జరిగే పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో సిలిచ్‌తో సామ్‌ క్వెరీ; బెర్డిచ్‌తో ఫెడరర్‌ తలపడతారు.మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం మూడో రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) జంట 7–6 (7/5), 6–2తో మెక్‌టిక్‌–అనా కొంజూ (క్రొయేషియా) జోడీపై నెగ్గగా... సానియా మీర్జా (భారత్‌)–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా) ద్వయం 6–7 (4/7), 4–6తో కొంటినెన్‌ (ఫిన్‌లాండ్‌)–హీతెర్‌ వాట్సన్‌ (బ్రిటన్‌) జంట చేతిలో ఓడిపోయింది. 

మరిన్ని వార్తలు