కటౌట్‌ను కసితీరా తన్నిన ఫ్యాన్‌..!

11 Oct, 2019 15:26 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : ఇతర దేశాలతో పోలిస్తే భారత ఉపఖండంలో క్రికెటర్లకు ఉన్న క్రేజే వేరు. అభిమాన ఆటగాళ్లను కలిసేందుకు మైదానంలోకి పరిగెత్తుకు వెళ్లి అరెస్టైన ఫ్యాన్స్‌ కూడా కోకొల్లలు. అయితే విజయం సాధించినపుడు ఆకాశానికెత్తేసే ​కొంతమంది ‘వీరాభిమానులు’.. ఓడిపోయిన సమయాల్లో వారిపై కోపం ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడరు. ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో జయభేరి మోగించిన పాకిస్తాన్‌.. టీ20 సిరీస్‌లో మాత్రం ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా స్టార్‌ ఆటగాళ్లు జట్టుకు దూరమైనప్పటికీ.. అద్భుత ప్రదర్శనతో లంక యువ ఆటగాళ్లు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. సుదీర్ఘ కాలంగా టీ20ల్లో వైట్‌వాష్ ఎరుగని జట్టుగా ఉన్న పాక్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి ప్రత్యర్థి జట్టుకు గట్టి షాకిచ్చారు.(చదవండి : అందుకే ఓడిపోయాం.. సరేనా: పాక్‌ కోచ్‌)

ఈ క్రమంలో పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, కోచ్‌ మిస్బావుల్‌ హక్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ఆటతో పరువు తీశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌ అహ్మద్‌ కటౌట్‌ను ఓ అభిమాని కసితీరా కొట్టి కాలితో తన్నాడు. కటౌట్‌ పూర్తిగా నేలమట్టం అయ్యేంత వరకు కోపంతో ఊగిపోతూ తిట్ల వర్షం కురిపించాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను సాజ్‌ సాదిఖ్‌ అనే నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని సర్ఫరాజ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు