వికెట్లను బ్యాట్‌తో కొట్టిన రోహిత్‌..

29 Apr, 2019 16:54 IST|Sakshi

అంపైర్‌ ఎల్బీ నిర్ణయంపై హిట్‌మ్యాన్‌ ఆగ్రహం

కోల్‌కతా: ప్రస్తుత ఐపీఎల్‌లో ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానా పడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటైన రోహిత్ శర్మ.. పెవిలియన్‌కి వెళ్తూ నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‌లోని బెయిల్స్‌ను బ్యాట్‌తో పడగొట్టాడు. దీంతో క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించడం కిందకు రావడంతో రోహిత్‌పై మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు.

ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 233 పరుగుల భారీ లక్ష్యంతో ముంబై ఇండియన్స్‌ లక్ష్యఛేదనకు దిగింది. నాలుగో ఓవర్‌ వేసేందుకు కోల్‌కతా ఫాస్ట్‌ బౌలర్‌ గర్నీ బౌలింగ్‌కు వచ్చాడు. ఓవర్‌లో మూడో బంతికి రోహత్‌శర్మను అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. రోహిత్‌శర్మ ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని కోరాడు. ఆ సమీక్షలో బంతి ఔట్‌ సైడ్‌లో పిచ్‌ కావడంతో పాటు లెగ్‌ వికెట్‌ను కొంచెం తాకుతూ వెళ్లినట్లు కనిపించింది.

దీంతో థర్డ్‌ అంపైర్‌..  ‘ఫీల్డ్‌ అంపైర్స్‌ కాల్‌’(తుది నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్లకే వదిలేయడం)కు అవకాశం ఇచ్చాడు. మైదానంలో అంపైర్‌గా ఉన్న నితిన్‌ మీనన్‌ ఔట్‌గా ప్రకటించడంతో రోహిత్‌ అసహనానికి గురయ్యాడు. బౌలింగ్‌ ఎండ్‌లో ఉన్న అంపైర్‌ దగ్గరికి వచ్చి ఏవో వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా అక్కడున్న వికెట్లను తన బ్యాట్‌తో కొట్టాడు. దీంతో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద రోహిత్‌శర్మకు మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత పడింది. ఈ మ్యాచ్‌లో ముంబై 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. హార్దిక్‌ పాండ్యా(91; 34బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్‌ చేసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.

మరిన్ని వార్తలు