కుంబ్లే... కట్టు... వికెట్టు

2 Jun, 2020 00:16 IST|Sakshi

దిగ్గజ స్పిన్నర్‌ అసమాన ప్రదర్శన

గాయపడినా బౌలింగ్‌కు సిద్ధం

తలకు కట్టుతో బరిలోకి

2002 ఆంటిగ్వా టెస్టులో ఘటన  

‘నాది ఒకటే అభ్యర్థన. దయచేసి అప్పీల్‌ మాత్రం చేయవద్దు’... అనిల్‌ కుంబ్లేకు భారత ఫిజియో ఆండ్రూ లీపస్‌ ఆ రోజు ఇచ్చిన సూచన ఇది. కానీ ఒక దిగ్గజ ఆటగాడిని బౌలింగ్‌ చేయకుండా, వికెట్‌ కోసం అప్పీల్‌ చేయకుండా ఆపడం ఆ గాయానికే సాధ్యం కాలేదు! తలకు చుట్టిన ఆ కట్టు బిగువున బాధను భరిస్తూనే అతను తనదైన శైలిలో తన పని చేసుకుంటూ పోయాడు. అలాంటి ఒక అప్పీల్‌కే ప్రత్యర్థి స్టార్‌ బ్యాట్స్‌మన్‌ లారా చిక్కాడు. తన బాధ్యత నెరవేర్చినట్లు భావించిన అనిల్‌ ఆ నొప్పిని మర్చిపోయాడు. కానీ నాటి అపూర్వ ప్రదర్శనను మాత్రం ఏ భారత క్రీడాభిమాని కూడా మరచిపోడు. అంకిత భావంలో, పోరాటతత్వంలో అందరికీ అందనంత ఎత్తులో ఉండే అనిల్‌ కుంబ్లే దానిని ఆంటిగ్వా గడ్డపై నిరూపించాడు.   

వెస్టిండీస్‌ గడ్డపై 2002లో సౌరవ్‌ గంగూలీ నాయకత్వంలో భారత జట్టు పర్యటించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లు ముగిసేసరికి ఇరు జట్లు చెరో టెస్టు గెలిచి 1–1తో సమంగా ఉన్నాయి. సెయింట్‌ జాన్స్‌ (ఆంటిగ్వా)లో నాలుగో టెస్టు జరిగింది. తొలి రోజు భారత్‌ 226/3తో పటిష్ట స్థితిలో నిలవగా, రెండో రోజు ఆటలో వికెట్‌ కీపర్‌ అజయ్‌ రాత్రా కంటే ముందే ఏడో స్థానంలో అనిల్‌ కుంబ్లే బ్యాటింగ్‌కు వచ్చాడు. మరో ఎండ్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఉన్నాడు.  

విలవిలా...
విండీస్‌ పేసర్‌ మెర్విన్‌ డిల్లాన్‌ అప్పటికే బౌన్సర్లతో జోరు మీదున్నాడు. కుంబ్లేపై కూడా అతను వచ్చీ రాగానే ఇలాగే ఒక షార్ట్‌ పిచ్‌ బంతిని సంధించాడు. తప్పించుకునే ప్రయత్నంలో కుంబ్లే తల పక్కకు తిప్పేసినా దూసుకొచ్చిన బంతి అతని దవడను బలంగా తాకింది. పదునైన పేస్‌ బౌలింగ్‌ దెబ్బకు అతని ముఖం ఒక్కసారిగా అదిరిపోయింది. ఫిజియో ఆండ్రూ లీపస్‌ క్రీజ్‌ వరకు వచ్చేలోపే క్షణాల్లో గాయం నుంచి తీవ్రంగా రక్తం కారింది. స్వల్ప చికిత్స తర్వాత మైదానం వీడాలని సహచరులు కోరినా కుంబ్లే ఒప్పుకోలేదు. తాను ప్రధాన బ్యాట్స్‌మన్‌ కాకపోయినా పట్టుదలగా నిలబడేందుకే సిద్ధమయ్యాడు.

డిల్లాన్‌ ఏమీ కనికరం చూపలేదు. మళ్లీ అలాగే చెలరేగిపోయాడు. చివరకు డిల్లాన్‌ బౌలింగ్‌లోనే బ్యాక్‌వర్డ్‌ షార్ట్‌ లెగ్‌లో చందర్‌పాల్‌కు క్యాచ్‌ ఇచ్చి కుంబ్లే వెనుదిరిగాడు. ఘటన జరిగిన రోజు ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయగా ఏమీ కనిపించలేదు. కానీ మరుసటి ఉదయం నొప్పి తీవ్రమైందని కుంబ్లే చెప్పడంతో మరో ఎక్స్‌రే తీశారు. అప్పుడు దవడలో పగులు వచ్చినట్లు కనిపించింది. అయితే భారత్‌లోనే సర్జరీ చేస్తే మంచిదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావించింది. దాంతో గాయంపై ఒత్తిడి పడకుండా పెద్ద బ్యాండేజీ చుట్టిన ఫిజియో లీపస్‌... ఎలాంటి కదలిక లేకుండా, కనీసం మాట్లాడకుండా కూర్చోవాలని చెప్పేశాడు. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు.  

బ్యాండేజీతో బరిలోకి...
వీవీఎస్‌ లక్ష్మణ్‌ (130), అజయ్‌ రాత్రా (115), రాహుల్‌ ద్రవిడ్‌ (91), వసీమ్‌ జాఫర్‌ (86) రాణించడంతో... మూడో రోజు భారత్‌ తొమ్మిది వికెట్లకు 513 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. విండీస్‌ బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి పిచ్‌ స్పిన్‌కు కాస్త అనుకూలంగా కనిపించింది. కానీ ప్రధాన స్పిన్నర్‌ కుంబ్లే ఆడలేడు కాబట్టి కెప్టెన్‌ గంగూలీ ఏమీ చేయలేక ఇతర బౌలర్లపై ఆధారపడ్డాడు. అయితే అనూహ్యంగా కట్టుతోనే కుంబ్లే క్రీజ్‌లోకి వచ్చేందుకు సిద్ధం కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అవసరంగా ఒత్తిడి పెంచుకోవద్దు, విశ్రాంతి తీసుకోమని కెప్టెన్‌ గంగూలీ చెప్పినా కుంబ్లే వినలేదు. ఇలా మధ్యలో నేను వదిలి వెళ్లలేనంటూ బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు.

తొలి ఓవర్‌లోనే అతను నొప్పితో అల్లాడుతుండటం చూసిన అంపైర్‌ డేవిడ్‌ షెఫర్డ్‌ బౌలింగ్‌ చేయగలవా అంటూ మళ్లీ మళ్లీ అడిగాడు. ఆ ఓవర్‌ తర్వాత లీపస్‌ మళ్లీ వచ్చి గట్టిగా కట్టు కట్టాడు. చివరకు కుంబ్లే అదే పట్టుదలతో బౌలింగ్‌ చేసి అత్యంత కీలకమైన బ్రియాన్‌ లారా వికెట్‌ పడగొట్టాడు. ఆఫ్‌స్టంప్‌ పడి లోపలకు దూసుకొచ్చిన బంతికి లారా వికెట్ల ముందు ఎల్బీగా దొరికిపోయాడు. ఆ సమయంలో కుంబ్లేలో కనిపించిన భావోద్వేగం గురించి చెప్పేందుకు మాటలు చాలవు. వరుసగా 14 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అనంతరం మూడో రోజు ఆట ముగిసింది. టెస్టు మ్యాచ్‌ పేలవ ‘డ్రా’గా ముగిసినా... అనిల్‌ కుంబ్లే పోరాటం ప్రత్యేకంగా నిలిచిపోయింది.  

మ్యాచ్‌ను చూస్తూ ఊరికే కూర్చోవడం నాకు బాగా అనిపించలేదు. అందుకే బరిలోకి దిగాను. జట్టు కోసం నాకు సాధ్యమైనంత రీతిలో ప్రయత్నం చేశాననే సంతృప్తితో ఇప్పుడు స్వదేశం వెళ్లగలుగుతున్నాను కదా.              
 –కుంబ్లే వ్యాఖ్య  

కొసమెరుపు...
కుంబ్లే లేని భారం మ్యాచ్‌పై అందరికంటే ఎక్కువగా సచిన్‌పై పడింది. అతని స్పిన్‌ను గంగూలీ నమ్ముకోవడంతో విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో సచిన్‌ ఏకంగా 34 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. 200 టెస్టుల కెరీర్‌లో అతను ఒక మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసిన అత్యధిక ఓవర్లు ఇవే. మరోవైపు భారత్‌ తరఫున ఆడిన 11 మంది కూడా ఈ ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేశారు. టెస్టు చరిత్రలో ఇలా జరగడం ఇది మూడోసారి మాత్రమే.  

 –సాక్షి క్రీడా విభాగం  

మరిన్ని వార్తలు