కుంబ్లే ‘హీరో’చిత సెంచరీకి 11 ఏళ్లు

10 Aug, 2018 14:53 IST|Sakshi
అనిల్ కుంబ్లే (ఫైల్‌ ఫొటో)

టీమిండియా మాజీ కోచ్‌, లెగ్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లేకు ఆగస్టు 10 చిరస్మరణీయ రోజుల్లో ఒకటి. మైదానంలో గింగిరాలు తిప్పే బంతులతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించే ‘జంబో’సరిగ్గా 11 ఏళ్ల కిందట బ్యాట్‌తోనూ మెరిశాడు. 500కు పైగా మ్యాచ్‌లాడిన కుంబ్లే తన అంతర్జాతీయ కెరీర్‌లో ఏకైక శతకం (110 నాటౌట్‌) సాధించిన రోజు ఇది. ఇది జరిగింది భారత్‌లోనో లేక ఆసియా గడ్డపై మాత్రం కాదు. పేస్‌ బౌలర్లు చెలరేగే ఇంగ్లండ్‌ గడ్డపై కావడం గమనార్హం. చివరికి మ్యాచ్‌ డ్రా కావడంతో సిరీస్‌ను 1-0తో భారత్‌ కైవసం చేసుకుంది. 

ద్రవిడ్‌ కెప్టెన్సీలో సిరీస్‌ విజయం
2007లో రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్సీలో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించింది. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్ట్‌ డ్రా కాగా, ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా నెగ్గింది. ఇక ఓవల్‌ వేదికగా ఆగస్టు 9న ఇంగ్లండ్‌, టీమిండియాల మధ్య చివరిదైన మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ నెగ్గిన భారత్‌ బ్యాటింగ్‌ చేసంది. కీపర్‌ ఎంఎస్‌ ధోని (92), ఓపెనర్‌ దినేష్‌ కార్తీక్‌ (91), సచిన్‌ టెండూల్కర్‌ (82), రాహుల్‌ ద్రవిడ్‌ (55), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (51) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ఈ ఇన్నింగ్స్‌లోనే అనిల్‌ కుంబ్లే బ్యాట్‌తో తొలిసారి సత్తా చాటాడు. 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫోర్‌ కొట్టి సెంచరీ సంబరాలు చేసుకున్నాడు. శ్రీశాంత్‌ (35) ఔట్‌ కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 664 పరుగులకు ఆలౌటైంది. 

193 బంతులు ఎదుర్కొన్న కుంబ్లే 16 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కుంబ్లే, జహీర్‌ ఖాన్‌ రాణించడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో  345 పరుగులకే చాప చుట్టేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 180/6 వద్ద డిక్లేర్‌ చేసి.. ఇంగ్లండ్‌ ముందు 500 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. అయితే 5 రోజులు ఆట ముగియడం, మరోవైపు ఇంగ్లండ్‌ (369/6)ను భారత్‌ ఆలౌట్‌ చేయక పోవడంతో టెస్ట్‌ మ్యాచ్‌ డ్రా అయింది. టెస్ట్‌ సిరీస్‌ను ద్రవిడ్‌ సేన 1-0తో సాధించింది. అయితే ఆల్‌రౌండ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించిన కుంబ్లేకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ దక్కింది.

కుంబ్లే రికార్డులు పదిలం
భారత్‌ తరఫున 1990లో అరంగేట్రం చేసిన కుంబ్లే 17 ఏళ్ల తర్వాత(2007లో) సెంచరీ చేశాడు. కుంబ్లే కెరీర్‌లో ఏకైక సెంచరీ ఇంగ్లండ్‌ గడ్డమీద ఆ జట్టుమీదే సాధించడం కొసమెరుపు. భారత్‌ నుంచి అతిపెద్ద వయసు (36 ఏళ్ల 296 రోజులు)లో శతకం సాధించిన ఆటగాడిగానూ కుంబ్లే పేరిటే రికార్డ్‌ ఉంది. అదే ఏడాది వన్డేలకు వీడ్కోలు పలికిన జంబో, 2008లో టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అనంతరం టీమిండియాకు ప్రధాన కోచ్‌గా సేవలందించిన కుంబ్లే.. జట్టుకు పలు సిరీస్‌ విజయాలు అందించాడు.

మరిన్ని వార్తలు